HBD Vijay Deverakonda: ఆ రోజు నుంచి ఈ రోజు దాకా.. క్రేజీ హీరో జెట్ స్పీడ్
చాలా తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో మన రౌడీ స్టార్ ఒకరు. సరిగ్గా ఇదే రోజు అనగా మే 9వ తేదీ 1989 సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించిన ఆయన నేడు తన 31వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. చిన్నతనం నుంచే సినిమాలు, నటన పట్ల ఆసక్తి చూపుతూ వచ్చిన విజయ్ దేవరకొండ చివరకు తాను ఏదైతే కావాలనుకున్నాడో ఆ టార్గెట్‌కి పూలబాటలు వేసుకున్నారు. తెలుగు చిత్రసీమలో క్రేజీ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్నారు. అంతేకాదు అనతికాలంలోనే సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు. మొదట నాటకాలు వేస్తూ నటన మెరుగుపర్చుకున్న విజయ్ దేవరకొండ.. ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత సినిమాల్లో ప్రయత్నించారు. ఎలాగైనా గొప్ప నటుడిని కావాలనే ఆకాంక్షతో ఆడిషన్స్ వెళ్లారు. మొదట రవిబాబు 'నువ్విలా' ఆడిషన్స్‌లో పాల్గొన్న ఆయన ఆ సినిమాలో అవకాశం పట్టేశారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్నపాత్రలో నటించారు. ఆ వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నానితో కలసి నటించారు. ఈ సినిమాల తర్వాత 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమై ఆకాశమే హద్దుగా దూసుకుపోయారు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్ రూపొందించిన 'పెళ్లి చూపులు' మూవీ ఆయన కెరీర్‌కి పునాదులు వేయగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ నట జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ సినిమాలో విజయ్ అభినయం, డెడికేషన్ చూసి టాలీవుడ్ ప్రేక్షకులంతా విజయ్ అభిమానులయ్యారు. యూత్ ఆడియన్స్‌లో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో దర్శకనిర్మాతల చూపు విజయ్‌పై పడి వరుస అవకాశాలు దక్కాయి. అలా అలా ఓ కామన్ మ్యాన్ నుంచి సంచలనాలు సృష్టించిన హీరో స్థాయికి ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఆయన కెరీర్‌లో మరో చెప్పుకోదగిన సినిమా 'గీతగోవిందం'. పరశురామ్ రూపొందించిన ఈ సినిమాలో విజయ్ పర్‌ఫార్‌మెన్స్ చూసి అమ్మాయిలంతా ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. ఒక్కసారిగా అందరి గుండెల్లో అలా నిలిచిపోయాడు విజయ్. దీంతో విజయ్ సినిమా వస్తుందంటే చాలు అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఆతృతగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే రోజులు వచ్చేశాయి. ఆ తర్వాత ''నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్'' లాంటి సినిమాలతో అలరించారు విజయ్. ఇకపోతే విజయ్‌కి ముక్కుసూటితనం కూడా చాలా ఎక్కువే. తన మనసులో ఉన్న దాన్ని బయటపెట్టేస్తూ కుండబద్దలు కొట్టే మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విషయంలో సెన్సార్ బోర్డు విషయమై, అదేవిధంగా ఇటీవలే ఫేక్ వార్తలు రాస్తున్న వెబ్‌సైట్స్ విషయమై తన భావాలను నిర్మొహమాటంగా, ధైర్యంగా బయటపెట్టి సంచలనం సృష్టించారు విజయ్. అయితే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని టాలీవుడ్ సెలబ్రిటీలందరూ మద్దతు పలకడం విశేషం. కేవలం ఐదేళ్లే.. జేబుతో 500 రూపాయలు లేని రోజు నుంచి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల్లో ఒకరిగా నిలిచారు విజయ్ దేవరకొండ. తారాజువ్వ లాంటి స్పీడ్‌తో క్రేజీ హీరో అయ్యారు. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నారు. ఈ సూపర్ స్పీడ్ క్రేజీ హీరోకి 'తెలుగు సమయం' తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కెరీర్‌లో మరెన్నో మైలురాయిలను చూడాలని కోరుకుంటున్నాం.
By May 09, 2020 at 08:21AM
No comments