HBD Anasuya Bharadwaj: జబర్దస్త్ జర్నీలో ఎన్నో మలుపులు.. ఆ హీరోతో క్రష్.. అన్నీ!
హాట్ బ్యూటీగా అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువైన భరద్వాజ్ పుట్టినరోజు ఈ రోజు (మే 15). 1985లో హైదరాబాద్‌లో జన్మించిన ఈమె ఎంబీఏ పూర్తిచేసి కెమెరా ముందుకొచ్చింది. మొదటగా టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత 'జబర్దస్త్' ఛాన్స్ పట్టేసి జనాల్లో క్రేజ్ కొట్టేసింది. అనసూయ చలాకీతనం, పాపులారిటీ చూసి ఆమెకు సినిమా అవకాశాలు కూడా ఇచ్చేశారు దర్శక నిర్మాతలు. అలా బుల్లితెర టు వెండితెరపై సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తోంది జబర్దస్త్ బ్యూటీ అనసూయ. అతి తక్కువ కాలంలో ఊహించని స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గత ఏడేళ్లుగా జబర్దస్తీ చేస్తూ క్రేజీ బ్యూటీగా మారింది. బుల్లితెర ఆడియన్స్, వెండితెర ఆడియన్స్ మాత్రమే కాదు నెటిజన్లకు కూడా అనసూయ సుపరిచితం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హీరోయిన్లను మించి గ్లామర్ ట్రీట్ ఇస్తుండటం ఆమెలోని మరో స్పెషాలిటీ. అలా అలా తన సోషల్ మీడియా ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది అనసూయ. బుల్లితెరపై వినోదం పంచుతూనే వెండితెరపై రాణిస్తూ మల్టిటాలెంటెడ్ బ్యూటీ అని కూడా అనిపించుకుంది అనసూయ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నాగ' అనే సినిమాలో చిన్న రోల్ లో కనిపించిన అనసూయ.. ఆ తర్వాత నాగార్జున చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'లో మెరిసింది. అనంతరం 'క్షణం' మూవీ చేసి వావ్ అనిపించింది. ఇక రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా ఆమె సిల్వర్ స్క్రీన్ జర్నీని మలుపుతిప్పింది. అందులో అనసూయ పోషించిన రంగమ్మత్త రోల్ బాగా ఆకర్షించింది. ఆ క్యారెక్టర్ తనకు తప్ప ఎవ్వరికీ సూట్ కాదు అన్నట్లుగా ఒదిగిపోయింది అనసూయ. ఇటీవలే ఈమెకు బాలీవుడ్ ఛాన్స్ కూడా వచ్చిందని టాక్. సుశాంక్ భరద్వాజ్‌ని పెళ్లాడిన అనసూయ.. గృహిణిగా, తల్లిగా కూడా పలువురి మెప్పు పొందుతోంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త, పిల్లలతో టూర్స్ వేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటుంది ఈ జబర్దస్త్ భామ. ఇకపోతే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు హీరో అర్జున్ అంటే ఫస్ట్ క్రష్ అని ఓపెన్‌గా చెప్పేసి ఆశ్చర్యపర్చింది అనసూయ. ఆయన నటించిన జెంటిల్‌మెన్ సినిమా చూసి ఫిదా అయ్యానని పేర్కొంది. అనసూయలో ఉన్న మరో కోణం ముక్కుసూటి తనం. తనకేదనిపిస్తే అది నిర్మొహమాటంగా బయటపెడుతూ ఉండటం అమ్మడి నైజం. ఈ క్రమంలో చాలాసార్లు విమర్శల పాలైంది కూడా. తనపై వచ్చే నెగెటివ్ కామెంట్స్ పట్ల రియాక్ట్ అవుతూ క్లాస్ పీకడంలో అనసూయ దిట్ట. సో.. ఎలా చూసుకున్నా అనసూయది ఓ జబర్దస్త్ జర్నీ. ఈ జర్నీలో ఆమె ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయాలని, సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తూ అందరినీ అలరించాలని ‘తెలుగు సమయం’ తరఫున కోరుకుంటూ అనసూయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హ్యాపీ బర్త్ డే అనసూయ.
By May 15, 2020 at 07:39AM
No comments