Breaking News

HappyBirthDay Krishna: సుదీర్ఘ సినీ ప్రస్థానం.. ఎన్నెన్నో మలుపులు.. తెలుగు సినీ చరిత్రలో!!


టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన, ఆయన సినీ కెరీర్‌కి సంబంధించిన ముఖ్య విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలుపెరగని సినీ ప్రస్థానం కొనసాగిస్తున్న కృష్ణ జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చిన్న నటుడిగా ఆరంగేట్రం చేసి సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. 1942 సంవత్సరం మే 31న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1965లో హీరోగా వెండితెరపై మెరిశారు. ఆయన తొలి సినిమా ‘తేనె మనసులు’. తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై 55 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆయన తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. గూఢచారి 116 మూవీ కృష్ణ కెరీర్‌కి గట్టి పునాది వేసింది. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అలా పడిన పునాదిపై నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌ కొనసాగిస్తూ 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో ఆయన అభినయించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి పలు విజయవంతమైన సినిమాలు రూపొందించారు. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడి గానూ 16 సినిమాలు తీసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ సొంతం. ఇకపోతే తెలుగు సినీ ప్రేక్షకులకు మొట్టమొదటి కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా కృష్ణనే. ఆ రోజుల్లోనే ముందుచూపుతో టెక్నికల్‌గా తెలుగు సినిమాను ఖ్యాతిని ప్రపంచానికి చాటే గొప్ప ప్రయత్నాలు చేశారాయన. అలా ఎన్నో సినిమాలతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న 'తేనె మనసులు' మూవీ కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటన ఇచ్చారు. అది చూసి స్పందించిన కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించారు. పలు వడపోతల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఎంపిక చేశారు. అలా సినీ కెరీర్ స్టార్ట్ చేసి తెలుగు సినీ చరిత్రలోనే విలక్షణ నటుడు, ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు కృష్ణ. కృష్ణ కుటుంబ నేపధ్యాన్ని చూస్తే.. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వారి పేర్లు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు ఉన్నారు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా రాణించలేక పోయాడు. 90ల్లో కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నించి, తర్వాతి దశలో సినీ నిర్మాతగా వ్యవహరించారు. 1987-90 మధ్యకాలంలో దాదాపు తన ఏడు సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కొడుకు మహేష్ బాబు 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమై వరుస హిట్స్ సాధిస్తూ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.


By May 31, 2020 at 08:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-krishna-birthday-special-article/articleshow/76115520.cms

No comments