Covid Origin Probe కరోనా పుట్టుకపై దర్యాప్తు.. ప్రపంచ దేశాల తీర్మానానికి భారత్ మద్దతు
పుట్టుక, మహమ్మారి విజృంభణపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వార్షిక సదస్సులో యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాల కూటమి తీసుకొస్తున్న ప్రతిపాదనను భారత్ సమర్థించింది. చైనాను దృష్టిలో పెట్టుకొని దీన్ని సిద్ధం చేస్తున్నా, అందులో ఎక్కడా ఆ దేశం పేరును ప్రస్తావించలేదు. కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్.. జంతువుల నుంచి మానవుల్లోకి వ్యాప్తిచెందిన తీరు, ఈ మహమ్మారిపై డబ్ల్యూహెచ్‌వో స్పందనపై నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ముసాయిదా ప్రతి కూడా సిద్ధమైంది. సోమవారం నుంచి జరిగే డబ్ల్యూహెచ్‌వో వార్షిక ప్రపంచ ఆరోగ్య సభ (డబ్ల్యూహెచ్‌ఏ)లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కు చైర్మన్ బాధ్యతలను భారత్ నిర్వర్తించనుంది. ఈ నేపథ్యంలో వార్షిక సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. జపాన్ స్థానంలో దక్షిణాసియా విభాగం నుంచి భారత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. గత ఏడాది చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న కొత్తరకం ప్రాణాంతక వైరస్‌పై భారత్ అధికారికంగా తన వైఖరిని వెల్లడించడం ఇదే మొదటిసారి. వైరస్ వ్యాప్తి గురించి తొలినాళ్లలో సమాచారాన్ని బయట ప్రపంచానికి తెలియనీయకుండా చైనా దాచిపెట్టిందని విమర్శలు వచ్చాయి. కరోనా వ్యాప్తి విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే ఈ తీర్మానాన్ని తెస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయంలో పలువురు దౌత్యవేత్తలు పేర్కొన్నారు. ఈ ఏడు పేజీల ముసాయిదా తీర్మానంలో చైనా, వుహాన్ పేర్లు ఎక్కడా లేవు. ఈ తీర్మానంలో ‘దర్యాప్తు’నకు బదులు ‘మదింపు’ అనే పదాన్ని చేర్చారు. తీర్మానంలోని అంశాలు ⍟ సార్స్-కోవ్-2 వైరస్‌కు మూలం ఏ జంతువు? ఇది మానవుల్లోకి ఎలా ప్రవేశించింది? మధ్యలో మరేదైనా జంతువు పాత్ర పోషించిందా? వంటి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి భాగస్వామ్యంతో కూడిన క్షేత్రస్థాయి శాస్త్రీయ పరిశోధనలకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ చర్యలు తీసుకోవాలి. ⍟కోవిడ్-19ను ఎదుర్కొనే విషయంలో గత అనుభవాలు, నేర్చుకున్న పాఠాలపై నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర మదింపు జరిపేందుకు చర్యలు తీసుకోవాలి. ⍟వ్యవస్థల సమర్థతపై విశ్లేషణ చేయాలి. కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్‌వో చర్యలు, వాటిని ఎప్పుడు చేపట్టారు వంటి అంశాలపై మదింపు వేయాలి ⍟అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలకు అనుగుణంగా కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన ప్రజారోగ్య సమాచారాన్ని సకాలంలో, అత్యంత కచ్చితత్వంతో డబ్ల్యూహెచ్‌వోకు అందించాలి. వర్చువల్ సమావేశం ద్వారా ఈ ముసాయిదాపై చర్చ జరుగుతుంది. ఈ తీర్మానానికి జపాన్, టర్కీ, రష్యా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా మద్దతు తెలిపాయి. అయితే ఈ అంశంపై అమెరికా ఇంకా తన వైఖరిని స్పష్టం చేయలేదు. అలాగే ఈ వ్యవహారంలో చైనాను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు, ఈ తీర్మానాన్నిభారత్‌లోని చైనా రాయబారి సన్ వెయిడాంగ్ తప్పుపట్టారు. సార్స్-కోవ్-2 వైరస్.. వుహాన్ ల్యాబ్ తయారు చేసిందని కానీ అక్కడి నుంచి లీకైందని కానీ చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో అధికారిక పత్రిక ‘లాన్సెట్’తోపాటు పలు దేశాల నిపుణులు పేర్కొన్నారని తెలిపారు. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా విఫలమైందనే వాదన వినబడుతోంది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ కూడా చైనాకు వంతపాడుతున్నారనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. చైనా మద్దతుతోనే డైరెక్టర్ జనరల్ పదవిని గ్యాబ్రియోసిస్ దక్కించుకున్నారని, అందుకే దాని రుణం తీర్చుకున్నారని అమెరికా విమర్శించింది.
By May 18, 2020 at 09:09AM
No comments