దాయాది మరో దుస్సాాహాసం.. పాక్ రేడియోలో కశ్మీర్ వాతావరణ సమాచారం
పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నాలుగు రోజుల కిందట పునరుద్దరించిన విషయం తెలిసిందే. పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్, మిర్పూర్‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను ఐఎండీ శుక్రవారం జారీచేసింది. దీనికి కౌంటర్‌గా జమ్మూ కశ్మీర్ వాతావరణ సమాచారం పాకిస్థాన్ అధికారికి రేడియో ఆదివారం నుంచి ప్రారంభించింది. శ్రీనగర్, పుల్వామా, లడఖ్ ఉష్ణోగ్రతల వివరాలను తెలిపింది. వెబ్‌సైట్‌లో జమ్మూ-కశ్మీర్‌కు సంబంధించిన సమాచారం ఇస్తోంది. అలాగే, ప్రభుత్వ ఆధీనంలోని పాకిస్థాన్ టెలివిజన్ కూడా ఈ ప్రాంతంపై ప్రత్యేక బులెటిన్ ఇస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తొలిసారిగా ఎన్నికలు నిర్వహణకు పాకిస్థాన్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ భూభాగంలో ఎన్నికలు నిర్వహించే అధికారం మీకు లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో ముజఫరాబాద్, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోనూ ఐఎండీ వాతావరణ సూచనలు చేసేది. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు నిలిపివేసింది. ఐఎండీ సూచనలతో పీఓకే తమదేనని పాక్‌కు భారత్ మరోసారి స్పష్టం చేసినట్టయ్యింది. దీంతో దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోయి.. ఏకంగా జమ్మూ కశ్మీర్ వాతావరణ సమాచారం తన అధికారిక రేడియోలో ప్రసారం చేసింది. దీనికి సంబంధించి పాక్ రేడియో చేసిన ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. లడఖ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత -4డిగ్రీల సెల్సియన్.. కనీస ఉష్ణోగ్రత -1 డిగ్రీ సెల్సియస్‌గా పేర్కొంటూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. మైనస్ ఒకటి మైనస్ నాలుగు తక్కువ కదా అంటూ సెటెర్లు వేయడంతో ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించారు. గతేడాది ఆగస్టులో జమ్మూ కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం మరో రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. కశ్మీర్‌కు దశాబ్దాలుగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత పార్లమెంట్ చట్టం చేసింది. దీంతో పాటు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. ఇవన్నీ పాక్‌ను ఇరుకున పెడుతూ తీసుకున్న నిర్ణయాల కావడంతో దానికి మింగుడుపడటం లేదు.
By May 11, 2020 at 07:04AM
No comments