Breaking News

చిరంజీవిని కదిలించిన మహిళా ఎస్‌ఐ దాతృత్వం.. ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడిన మెగాస్టార్


కరోనా కష్టకాలంలో మనసున్న మంచి మనుషులు ఎంతో మంది బయటికి వచ్చి అన్నార్థులను ఆదుకుంటున్నారు. పట్టెడు అన్నం పెట్టి వాళ్ల పొట్ట నింపుతున్నారు. అయితే, ఒడిశాలోని ఒక మహిళా పోలీస్ అధికారి వృద్ధ మహిళలకు స్వయంగా అన్నం తినిపించిన దృశ్యాలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ వృద్ధ మహిళలంతా మతిస్థిమితం లేనివారు, దివ్యాంగులు కావడంతో ఆమె స్వయంగా తన చేతులతో వారికి అన్నం తినిపించారు. ఒడిశాలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సుభశ్రీ నాయక్ చేస్తోన్న ఈ సామాజిక సేవకు ప్రశంసల వర్షం కురుస్తోంది. సుభశ్రీ చేస్తున్న సామాజిక సేవకు సంబంధించిన వీడియోలు చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా చలించిపోయారు. ఆమెతో ఎలా అయినా మాట్లాడాలని ప్రయత్నించారు. మొత్తానికి పోలీస్ శాఖ సహకారంతో సుభశ్రీతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఆమె చేసిన సేవను కొనియాడారు. ఇలాంటి సేవ చేయడానికి స్ఫూర్తి ఏంటని అడిగారు. ఇంత గొప్ప సేవ చేస్తోన్న సుభశ్రీని తప్పకుండా ఆ దేవుడి దీవిస్తాడని ఆశీర్వదించారు. ఈ సామాజిక సేవను ఇలానే కొనసాగించాలని ప్రోత్సహించారు. ఈ మేరకు సుభశ్రీతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన రికార్డెడ్ వీడియోను చిరంజీవి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. పెద్ద సినిమా స్టార్ అయిన చిరంజీవి తన వివరాలు తెలుసుకుని, తనతో వీడియో కాల్‌లో మాట్లాడటం పట్ల సుభశ్రీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వాస్తవానికి మదర్స్ డే నాడు (మే 10న) సుభశ్రీ గురించి చిరంజీవి ఒక వీడియోను ట్వీట్ చేశారు. ‘‘ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక దృశ్యం చూసాను. అంగవైకల్యంతో, మతిస్థిమితం లేక రోడ్డు పక్కన పడి ఉన్న ఒక అనాధ నోటికి ఆప్యాయంగా అన్నం ముద్దలు కలిపి తినిపిస్తున్న దృశ్యం. నా హృదయాన్ని టచ్ చేసింది. ఒక మనిషి మరో మనిషిని ముట్టుకోవాలంటే భయపడే ఈ రోజుల్లో ఆ అభాగ్యురాలిని అక్కున చేర్చుకుని ఆమె ఆకలి తీర్చింది. అలా తినిపించడంతో ఆమెలో మానవత్వం, మాతృత్వం చూశాను. పోలీసులు కఠినంగా ఉంటారు, వాళ్లకు గుండె ఉండదు అనేవాళ్లు తెలుసుకోవాలి.. వాళ్లకూ హృదయం ఉంటుంది.. అది కఠినంగా కాదు కారుణ్యంతో ఉంటుంది అని తెలియజెప్పిన దృశ్యం ఇది. ఈ సంఘటన చూసిన తరవాత ఆ పోలీస్ అధికారిణితో మాట్లాడాలని, నా స్పందన తెలియజేయాలని, ఆ రకంగా మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మీతో పంచుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఫలించింది. ఆమె పేరు సుభశ్రీ జీ.. పోలీస్ ఎస్‌ఐ. ఆమెతో నేను ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను నా నెక్ట్స్ పోస్ట్‌లో చూడగలరు’’ అని ఆ వీడియోలో చిరంజీవి వెల్లడించారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడిన వీడియోను ప్రజలతో పంచుకున్నారు.


By May 12, 2020 at 11:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/odisha-police-si-subhasri-nayak-appreciated-by-megastar-chiranjeevi-for-her-social-service/articleshow/75689222.cms

No comments