Breaking News

ఎలక్ట్రిక్ ‘షాక్’.. శవపరీక్షకు తీసుకెళ్లాక బతికాడు!


హై టెన్షన్ వైర్లు తగిలి ఎలక్ట్రిక్ షాక్‌తో ఓ వ్యక్తి చనిపోగా.. శవపరీక్ష నిమిత్తం హాస్పిటల్‌కు తరలించగా అతడు బతికే ఉన్నాడు. వెంటనే హాస్పిటల్‌లో చేర్పించగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లోహర్‌డగా జిల్లాలోని కైరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఖర్తా అనే గ్రామంలో జితేంద్ర ఓరాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఊళ్లో వేసిన టెంట్ తొలగిస్తుండగా.. హై టెన్షన్ కరెంట్ వైర్లు తగిలి కుప్పకూలాడు. వెంటనే జితేంద్రను చన్హో బ్లాక్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా.. అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని చాన్హో పోలీసులకు అప్పగించగా.. శవ పరీక్ష నిమిత్తం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (రిమ్స్)కు తరలించారు. డెడ్ బాడీని తిరిగి తీసుకొని రావడం కోసం జితేంద్ర తమ్ముడు కూడా రిమ్స్‌కు వెళ్లాడు. శవ పరీక్ష కోసం ట్రాలీ మీద తీసుకెళ్లగా.. అతడు బతికే ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. కానీ కాసేపటికే అతడు చనిపోయాడు. కొంచెం ముందు తీసుకొని వచ్చి ఉంటే అతడు బతికేవాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా అతడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. 11 గంటల ప్రాంతంలో డెడ్ బాడీని తీసుకెళ్లిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు రాంచీలోని రిమ్స్‌కు తీసుకెళ్లాడు. ఇంత సమయం వృథా కాకుండా ఉంటే మా అన్నయ్య బతికేవాడేమో అని జితేంద్ర సోదరుడు వ్యాఖ్యానించాడు. రిమ్స్ డాక్టర్లు కూడా ఇదే విషయం చెప్పారన్నారు. కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. హాస్పిటల్‌కు తీసుకొచ్చే సరికే అతడు శ్వాస తీసుకోవడం లేదని, నాడి కొట్టుకోవడం లేదని తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ కూడా ఈ ఘటనపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం.


By May 27, 2020 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jharkhand-dead-man-brought-for-autopsy-shows-signs-of-life/articleshow/76022167.cms

No comments