Breaking News

పక్కింటివారిపై కానిస్టేబుల్ కాల్పులు... ముగ్గురికి గాయాలు


దేశరాజధానిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వైపు ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో అక్కడ ఓ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులకు దిగాడు. సీలంపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి... మీట్ నగర్ లోని ఓ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఈ మొత్తం గొడవలో ఐదుగురు గాయపడగా... అందులో ముగ్గురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే కానిస్టేబుల్ కాల్పులకు అక్కడ జరిగిన గొడవే కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం కానిస్టేబుల్ ఇంటి వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. పక్కింటి వాళ్లతో కానిస్టేబుల్ సోదరుడికి మధ్య ఘర్షణ తలెత్తింది. చిన్న గొడవ కాస్త చినికి చినికి గాలివానలా మారింది. దీంతో కానిస్టేబుల్ సోదరుడిపై పక్కింటి వ్యక్తి దాడికి దిగాడు. ఈ దాడిలో సోదరుడి తలకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో సోదరుడిపై దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు గాయపడ్డారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సహా మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానిస్టేబుల్‌తో పాటు మరో నలుగురికి ఈ గొడవతో సంబంధాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు.


By May 05, 2020 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-constable-opens-fire-during-quarrel-with-neighbour/articleshow/75546102.cms

No comments