టాలీవుడ్‌కు జగన్ శుభవార్త.. కేసీఆర్ ఎప్పుడో!?
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం 4.0 లాక్ డౌన్ నడుస్తుండగా.. ఈ సారి మాత్రం మునుపటితో పోలిస్తే చాలా వాటికి సడలింపులు ఇచ్చారు. అయితే అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీకి మాత్రం అస్సలు సడలింపులు ఇవ్వనే లేదు. కాగా కొన్నింటికి అనుమతివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది. ఈ తరుణంలో ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్.. టాలీవుడ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏపీలో సినిమా, సీరియల్ షూటింగ్స్ జరుపుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో టాలీవుడ్‌కు కాస్త రిలీఫ్ దొరికినట్లేనని చెప్పుకోవచ్చు.
లెక్కల వివరాలిలా..!
షూటింగ్స్ లొకేషన్స్‌ను బట్టి రూ. 5వేలు, 10 వేలు, 15 వేల రూపాయిలు చెల్లించి షురూ చేసుకోవచ్చని.. పూర్తయ్యి లొకేషన్స్ ఖాళీ చేసే టైమ్‌లో ప్రభుత్వానికి చెల్లించిన సొమ్ము యథావిధిగా రీఫండ్ చేస్తామని కూడా టాలీవుడ్‌కు జగన్ సర్కార్ భరోసా నిచ్చింది. నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్స్‌కు అనుమతులు ఇస్తున్నామని తెలిపింది. లెక్కల విషయానికొస్తే.. విశాఖపట్నం, తిరుపతి, భీమునిపట్నం, టూరిజం, ఆర్&బీ డిపార్ట్‌మెంట్స్ పరిధిలోకి వచ్చే లొకేషన్ స్పాట్లకు గాను రూ.5వేలు చెల్లించాలి. దేవాదాయ శాఖ పరిధిలోని కట్టడాలు, హార్టీకల్చర్, అడవులు, పబ్లిక్ లైబ్రరీల్లో షూటింగ్స్ జరుపుకోవాలంటే రూ.10వేలు చెల్లించాలి. అర్బన్ డెవలప్‌మెంట్, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మ్యూజియంలు, స్కూళ్లు, పబ్లిక్ పార్కులను రూ.15వేలు చెల్లించాలని ఇవన్నీ డిపాజిట్స్ రూపంలో చెల్లిస్తే షూటింగ్స్ పూర్తయ్యాక ఎంత చెల్లించారో అంతా రిఫండ్ చేస్తామని ఉత్వర్వుల్లో జగన్ సర్కార్ స్పష్టం చేసింది.
కేసీఆర్ ఎప్పుడు చెబుతారో!?
వాస్తవానికి సినీ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్‌లోనే ఉంది. సినిమా షూటింగ్స్ కూడా హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయ్. ఏపీతో పొలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ షూటింగ్స్ జరుగుతుంటాయ్. అంతేకాదు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరమైన హైదరాబాద్‌లోనే ఎక్కువ థియేటర్స్, మల్టీఫ్లెక్స్‌లు ఉన్నాయ్. ప్రస్తుతం టాలీవుడ్‌లోని భారీ బడ్జెట్ సినిమాలు మొదలుకుని చిన్నపాటి సినిమాల వరకూ తెలంగాణలో ఎక్కువగా జరుగుతుంటాయ్. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి శుభవార్త చెప్పలేదు. పైగా థియేటర్స్ ఓపెన్ చేయడానికి అస్సలే ఒప్పుకోవట్లేదు. 4.0 లాక్‌డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు సడలింపులు ఇచ్చింది. అలాంటిది కేసీఆర్ నుంచి త్వరలో ఓ మంచి శుభవార్త వస్తుందని దర్శకనిర్మాతలు, థియేటర్స్ యాజమాన్యాలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. జగన్ శుభవార్త చెప్పేశారు.. ఇక కేసీఆర్ ఎప్పుడు చెబుతారో..? అసలు సడలింపులు ఇచ్చే ఉద్దేశం కేసీఆర్‌కు ఉందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడక తప్పదు మరి.
By May 20, 2020 at 07:03PM
No comments