Breaking News

దేశంలో పెరిగిన కరోనా ఉద్ధృతి.. నిన్న ఒక్క రోజే 6,000 పాజిటివ్ కేసులు


దేశంలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,000 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 2,334 కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో వరుసగా ఆరో రోజు పాజిటివ్ కేసులు 2వేల మార్క్ దాటడం గమనార్హం. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 118,226కి చేరింది. ఇప్పటి వరకూ కరోనాతో దేశంలో మొత్తం 3,548 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల కిందటే కోవిడ్-19 బాధితుల సంఖ్య లక్ష దాటగా.. గడిచిన 20 రోజుల్లోనే దాదాపు 70వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మన కంటే ఇరాన్ ముందు స్థానంలో ఉండగా.. దానిని నేడో రేపో అధిగమించే సూచనలు కనబడతున్నాయి. ఇక, మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 41,000 మార్క్ దాటగా.. ఒక్క ముంబయి మహానగరంలోనే 25,500 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలోనే ఉన్నాయి. దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య ప్రస్తుతం 17కు చేరింది. నిన్న మొన్నటి వరకూ తక్కువ కేసులు నమోదయిన ఒడిశా, కర్ణాటక, హర్యానాలోనూ ఒక్కసారిగా మహమ్మారి తీవ్రత పెరిగిపోయింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.1%కి తగ్గగా... కోలుకున్నవారి శాతం 40 శాతానికి పెరగడం సానుకూల పరిణామం. అయితే, గత ఆరు రోజులుగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. సగటున రోజుకు 5,400 చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి. పరీక్షలు చేయించుకున్నవారిలో.. ప్రతి 18.23 మందిలో ఒకరికి కొవిడ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను సడలించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేసులు మరింత వేగంగా పెరిగే ముప్పుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ఉద్ధృతి అధికమవుతున్నప్పటికీ, కోలుకుంటున్న బాధితుల శాతం కూడా పెరగడం సానుకూల పరిణామం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గురువారం నాటికి 40.31 శాతానికి చేరింది. బుధవారంతో పోలిస్తే అది 0.69% ఎక్కువ. మరణాల శాతం బుధవారంతో పోలిస్తే 0.4% తగ్గి 3.05 శాతానికి చేరడం మరో సానుకూలాంశం. మరోవైపు, కొత్తగా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్నవారిలో 4.29% మంది వైరస్‌ పాజిటివ్‌గా తేలారు. ప్రతి 23.28 మందిలో ఒకరికి సోకినట్లు నిర్ధారణ అయింది. గురువారం మహారాష్ట్రలో అత్యధికంగా 2334 కేసులు నమోదు కాగా.. తర్వాత తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ కర్ణాటకలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మరో 140 మంది ప్రాణాలు కోల్పోగా అత్యధికంగా మహారాష్ట్రలోనే 50 మందికిపైగా ఉన్నారు. తెలంగాణలో గురువారం ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో వైరస్ మొదలైన తర్వాత ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.


By May 22, 2020 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-records-over-6000-coronavirus-cases-in-a-day-tally-at-118226/articleshow/75882048.cms

No comments