Breaking News

కశ్మీర్‌లో కల్లోలానికి కొత్త ఉగ్రవాద సంస్థ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రారంభించిన పాక్!


గత కొన్ని వారాలుగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. పలు చోట్ల దాడులకు పాల్పడుతుండగా.. ఉగ్రమూకల చర్యలను సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు జవాన్లు అమరులయ్యారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో దాడులకు ఓ కొత్త ఉగ్రవాద గ్రూప్‌ను పాక్ తయారుచేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికను అందజేశాయి. ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ పేరుతో ఏర్పడిన ఈ ఉగ్రవాద ముఠాను లష్కరే తొయిబా అగ్రనేత ఒకరు హ్యాండిల్ చేస్తున్నట్టు గుర్తించారు. గతేడాది జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం రద్దుచేసిన తర్వాతే ఈ టీఆర్ఎఫ్‌ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. పాక్ ఇస్లామిక్ జిహాదీ టెర్రర్ ఫ్యాక్టరీగా మారిపోయిందని భారత్ ఆరోపించడం, దీనికి అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. ఈ ఒత్తిడిని నివారించడానికి ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్ వాచ్‌డౌన్ ఎఫ్ఎటిఎఫ్ దృష్టి మరల్చి కశ్మీర్‌లో కల్లోలం సృష్టించడానికి దీనిని రూపొందించబడింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా లో-కీ జేకే పీర్ పంజల్ పీస్ ఫోరం వంటి పేర్లను పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ సూచించిందని, వీటికి మతపరమైన ముద్ర లేదు, కానీ ఇది ఉగ్రవాదాన్ని సూచిస్తుందని ఓ భద్రతా అధికారి వెల్లడించారు. టీఆర్ఎఫ్‌ను లష్కరే నేతలు స్థాపించినట్టు ఐబీ నివేదిక పేర్కొంది. దీనిని పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు అగ్రనేతలు హ్యాండిల్ చేస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లో సాజిద్ జాత్, మధ్య కశ్మీర్‌లో ఖలీద్, ఉత్తర కశ్మీర్‌లో హంజాల్ అద్నాన్ నిర్వహిస్తున్నట్టు నివేదిక తెలిపింది. స్థానికులను ఆకర్షించి, వారి సాయంతో దాడులకు పాల్పడటమే దీని లక్ష్యమని భద్రతా అధికారులు తెలిపారు. కెరాన్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఉదాహరణ అని తెలిపారు. ఐదుగురు ఉగ్రవాదులు హతమైతే అంతే సంఖ్యలో సైనికులు మరణించారని, టీఆర్ఎఫ్ సోషల్ మీడియాను పాక్ నుంచి నడుపుతున్నారని అన్నారు. హంద్వారాలో కాల్పులకు తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ కల్నల్, మేజర్ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తమ రికార్డుల్లో ఉన్న ప్రతి టీఆర్ఎఫ్ ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం లేదా చంపడమో జరిగిందని జమ్మూ కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. టీఆర్ఎఫ్ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోందని, హిజ్బుల్ ఉగ్రవాదులను తమలో కలుపుకుంటోందని అన్నారు. కశ్మీర్‌లో భూటకపు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడుతోన్న భారత్.. నేరాన్ని తమపై నెట్టేయడానికి ప్రయత్నిస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ రెండు రోజుల కిందట ట్వీట్ చేశారు. భారత దురాక్రమణకు వ్యతిరేకంగా కశ్మీరీలు ప్రతిఘటిస్తున్నారని, వారిని అతి క్రూరంగా అక్కడ ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇటీవలే ఐఎస్ పబ్లిక్ రిలేషన్స్ మాజీ లెఫ్టినెంట్ జనరల్‌ అసిమ్ సలీమ్ బజ్వాను ఇమ్రాన్ తన మీడియా బృందంలో చేర్చుకున్నారు.


By May 09, 2020 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pak-launches-the-resistance-front-a-terrors-new-face-in-kashmir/articleshow/75639484.cms

No comments