Breaking News

ముంబయి సెంట్రల్ జైల్లో 26 సిబ్బంది సహా 103 మందికి కరోనా పాజిటివ్


మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతోంది. గురువారం ఏకంగా 1,323 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 18వేలు దాటింది. ఒక్క ముంబయి నగరంలోనే బాధితుల సంఖ్య 11,300 దాటింది. కాగా, ముంబయి సెంట్రల్ జైల్లో ఖైదీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడ్డారు. ఆర్ధర్ రోడ్ జైల్లోని 77 మంది ఖైదీలు, సిబ్బంది 26 మంది మొత్తం 103కి వైరస్ నిర్ధారణ అయినట్టు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. బుధవారం ఓ ఖైదీ, ఇద్దరు గార్డులకు వైరస్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వైరస్ నిర్దారణ అయిన ఖైదీలను శుక్రవారం ఉదయం సెయింట్ జార్జ్, జీటీ హాస్పిటల్‌కు తరలించనున్నారు. వైరస్ సోకిన సిబ్బందిని కూడా క్యారంటైన్ కేంద్రానికి తరలించనున్నారు. వైరస్ బారినపడ్డ ఖైదీల్లో చాలా మంది ఒకే బ్యారక్‌లో ఉన్నవారేనని అధికారులు తెలిపారు. మంగళవారం ఓ ఖైదీకి పరీక్షలు నిర్వహించగా.. అతడికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో మరో 144 మందికి పరీక్షలు నిర్వహించగా 77 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. వైరస్ బారినపడ్డ ఖైదీలు ఉండే బ్యారక్‌లో 500 మంది ఉంటారని అధికారులు తెలిపారు. జైల్లోని సిబ్బంది సహా మొత్తం 270 మందికి ఇప్పటి వరకూ పరీక్షలు నిర్వహించినట్టు సీనియర్ జైలు అధికారి వెల్లడించారు. మొత్తం 26 మంది సిబ్బందికి వైరస్ సోకిందని, వీరు ఖైదీలు, అధికారుల సహా చాలా మందితో కాంటాక్ట్ అయినట్టు గుర్తించారు. లాక్‌డౌన్ మొదలైన తర్వాత మొత్తం 93 మంది జైలు సిబ్బంది రొటేషన్ పద్దతితో విధులు నిర్వర్తిస్తున్నారని అధికారులు వివరించారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో ఖైదీలు ఉండే జైళ్లలో ఆర్ధర్ రోడ్ జైలు ఒకటి. ఈ జైలు సామర్థ్యం 800 కాగా.. ప్రస్తుతం 2,800 మంది ఉన్నారు. ఇలాంటి చోట భౌతికదూరం నిబంధన పాటించడం సాధ్యం కాదు, కాబట్టి, ప్రతి ఖైదీ, సిబ్బంది సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైనవారికి ఐసోలేషన్‌కు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు.


By May 08, 2020 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-77-inmates-26-staffers-test-positive-at-arthur-road-jail-in-mumbai/articleshow/75614984.cms

No comments