Breaking News

దేశంలో కరోనా మరో రికార్డ్: లక్ష దాటేసిన పాజిటివ్ కేసులు.. 109 రోజుల్లో


దేశంలో కరోనా రక్కసి మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,713 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 2,033 కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో వరుసగా రెండో రోజు 2వేల మార్క్ దాటడం విశేషం. ఇక, పాజిటివ్ కేసుల్లోనూ కొత్త రికార్డు నమోదయ్యింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య లక్ష దాటింది. 109 రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 100,328కి చేరింది. దీంతో కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. సోమవారం మరో 130 మంది కొవిడ్‌ దెబ్బకు మృత్యువాతపడటంతో, మొత్తం మరణాల సంఖ్య 3,156కి పెరిగింది. ఇక, మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 35,000 మార్క్ దాటగా.. ఒక్క ముంబయి మహానగరంలోనే 21,000 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. నెల రోజుల కిందటితో పోలిస్తే సోమవారం నాటికి దేశంలో కేసులు 550% పెరిగాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 82 శాతం.. మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలోనే ఉన్నాయి. దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య ప్రస్తుతం 14కు చేరింది. సోమవారం దేశవ్యాప్త మరణాల్లో 51 మహారాష్ట్రలోనే సంభవించాయి. మరణాల రేటు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 8.89%గా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.1%కి తగ్గగా... కోలుకున్నవారి శాతం 38.29కి పెరగడం సానుకూల పరిణామం. గడచిన 24 గంటల్లో కొత్తగా 75,150 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మే 11 తర్వాత ఒక్కరోజులో చేసిన అతి తక్కువ పరీక్షల సంఖ్య ఇదే. ఢిల్లీలో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మే నెల ప్రారంభం నుంచి దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. గత 18 రోజుల్లో సగటున రోజుకు 3,477 చొప్పున కేసులు నమోదయ్యాయి. సోమవారం మహారాష్ట్రలో 2,033, తమిళనాడు 536, గుజరాత్ 366, రాజస్థాన్ 305, ఢిల్లీ 299, మధ్యప్రదేశ్ 254, ఉత్తరప్రదేశ్ 177, బీహార్ 103 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, కర్ణాటక (99)లో ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశవ్యాంగా 130 మంది ప్రాణాలు కోల్పోగా మహారాష్ట్ర 51, గుజరాత్ 35, ఢిల్లీ 12, రాజస్థాన్ 7, పశ్చిమ్ బెంగాల్ 6, ఉత్తరప్రదేశ్ 6, మధ్యప్రదేశ్ 4, జమ్మూ కశ్మీర్ ఇద్దరు ఉన్నారు. కరోనా కేసులు, మరణాల్లో ముంబయి నగరంలో అహ్మదాబాద్ పోటీపడుతోంది. ఇప్పటి వరకు ముంబయిలో 757 మంది ప్రాణాలు కోల్పోగా.. అహ్మదాబాద్‌లో 524 మంది చనిపోయారు. ముంబయి మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముంబయిలో మరణాల రేటు 3.64 శాతంగా ఉంటే.. అక్కడ 6.95గా ఉంది.


By May 19, 2020 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-in-india-cross-1-lakh-mark-over-3000-dead-in-109-days/articleshow/75817256.cms

No comments