చైనా ల్యాబ్ నుంచి కరోనా లీకయినట్టు ఆరోపణలు.. ట్రంప్ సంచలన ప్రకటన
ప్రపంచం మొతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్‌ను చైనాయే సృష్టించిందని అమెరికా.. కాదు కోవిడ్-19ను అమెరికా సైన్యమే తీసుకొచ్చిందని చైనా ఆరోపణలు గుప్పించగా.. వైరస్ విజృంభణకు సంబంధించిన నిందను తమ మీదకు మళ్లించడానికి చైనా ప్రయత్నిస్తోందని అమెరికా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో వైరస్ గుట్టును చేధించే దిశగా అగ్రరాజ్యం అడుగులు వేస్తోంది. తాజాగా, అమెరికాకు చెందిన సెనెటర్ల బృందం అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయంలో కొన్ని సూచనలు చేసింది. విచారణలో అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్ సహా ఇతర ఐరోపా దేశాలతో కలిసి పనిచేయాలని కోరింది. తద్వారా విచారణ పారదర్శకంగా, విశ్వసనీయంగా సాగుతుందని సూచించింది. అంతేకాదు, వైరస్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయాధికారం విషయంలోనూ దర్యాప్తు సాగాలని సెనెటర్లు సూచనలు చేశారు. ఈ మేరకు గురువారం రిపబ్లికన్ సెనెటర్ మాక్రో రూబియో నేతృత్వంలోని ఓ బృందం ట్రంప్‌నకు ఈ సూచనలతో కూడిన నివేదికన అందజేసింది. దీనిపై విచారణ కోసం ప్రత్యేకంగా ఓ ఉన్నతస్థాయి దౌత్యవేత్తను నియమించాలని సెనెటర్లు కోరారు. ఇటు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వైరస్‌కు సంబంధించిన ఇతర అంశాల్లోనూ విచారణ సాగాలని సూచించారు. వుహాన్‌లో వైరస్ వెలుగుచూసిన నాటి నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని సెనెటర్లు ఆరోపించారు. చివరకు అమెరికాను సైతం దోషిని చేసేందుకు ప్రయత్నించిందని చైనా అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన వెంటనే దీని పుట్టుక, అంతర్జాతీయ సంస్థల అధికారాన్ని ప్రభావితం చేయడంలో చైనా పాత్రపై ప్రపంచస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. తైవాన్ హెచ్చరికల్ని డబ్ల్యూహెచ్‌ఓ బేఖాతరు చేయడంలో చైనా ప్రభావం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరగాలని సూచించారు. మరోవైపు, వుహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ ప్రమాదవశాత్తు లీకయ్యిందని, దీని వల్ల అమెరికాలోని 22 మిలియన్ల ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది.. 2008 మాంద్యం నుంచి కోలుకుని సృష్టించబడిన అన్ని ఉద్యోగాలను నాశనం చేస్తుందని ట్రంప్ దుయ్యబట్టారు. రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా ట్రంప్ బుధవారం మాట్లాడుతూ.. వుహాన్‌లోని ల్యాబ్‌లోనే వైరస్‌ను జన్యుపరంగా తయారుచేసినట్టు పలు కథలు, కథలుగా చెప్పుకుంటున్నారని, జరిగిన ఈ భయంకరమైన పరిస్థితిని తాము చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు. వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కావడానికి ముందు సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసిందా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కూడా ట్రంప్ నిరాకరించారు. దీని గురించి చర్చించాలనుకోవడం లేదు, ప్రస్తుతం ఇది సరికాదన్నారు. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిన అంశం గురించి విచారణ జరుపుతామని సూచాయగా వెల్లడించారు. ఈ వైరస్ గురించి కొన్ని నెలల ముందే సమాచారం తెలిసి ఉంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్ గురించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రపంచదేశాలకు తెలపడంలో చైనా విఫలమైందని ట్రంప్ ఆరోపించారు.
By April 17, 2020 at 10:56AM
No comments