కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేదు.. ఆ మీడియాపై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం
ఉత్తర కొరియా అధినేత ఆరోగ్యంపై వచ్చిన వార్తలు తప్పుడు సమాచారంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. గురువారం వైట్‌హౌస్ వద్ద రోజువారీ మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. కిమ్ ఆరోగ్యం గురించి జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా తనకు వ్యతిరేకంగా వ్యవహరించే సీఎన్‌ఎన్ మీడియాపై ఆయన మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదికల ఆధారంగా కిమ్ ఆరోగ్యంపై సీఎన్‌ఎన్ కథనాలు ప్రసారం చేసిందని ట్రంప్ దుయ్యబట్టారు. కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజంలేదని ట్రంప్ కొట్టిపారేశారు. అయితే, కిమ్ ఆరోగ్యంగానే ఉన్నట్టు ఏదైనా సమాచారం ఉత్తర కొరియా నుంచి వచ్చిందా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. ఈ సమయంలోనే సీఎన్‌ఎన్‌ను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ తన విశ్వరూపం ప్రదర్శించారు. సీఎన్ఎన్ రిపోర్టర్ కైట్లిన్ కొలిన్స్ వైపు చూస్తూ సైగలు చేసిన ట్రంప్.. కిమ్ ఆరోగ్యం గురించి తప్పు నివేదిక వచ్చిందని భావిస్తున్నాను.. సీఎన్ఎస్ మీడియా పాత నివేదికలను ఉపయోగించారని అంటున్నారు.. నేను విన్నది అదే. ఆ నివేదిక తప్పు... ఇది తప్పుడు నివేదిక అని నేను బలంగా నమ్ముతున్నాను అని ట్రంప్ అన్నారు. ట్రంప్ తనవైపు చూసి సైగలు చేసిన విషయాన్ని గుర్తించిన సీఎన్ఎన్ రిపోర్టర్ కొలిన్స్.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఆరోగ్యం గురించి సమాచారం అందిందా? అని ప్రశ్నించింది. ‘దీని గురించి నేను చెప్పను.. ఉత్తర కొరియాతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయి.. కిమ్ జోంగ్ ఉన్‌తో ఎలాంటి విభేదాలు లేవు.. అతడు ఆరోగ్యం ఉన్నాడని బలంగా నేను నమ్ముతున్నాను’ అని సమాధానం ఇచ్చారు. దీనికి కొనసాగించేందుకు సీఎన్ఎస్ రిపోర్టర్ ప్రయత్నించగా ట్రంప్ వారించారు.. ఇక్కడతో ఆగండి.. వాస్తవాలను మీరు రాయడం లేదు, నాకు సంబంధించి నంతవరకు తదుపరి వ్యక్తి వద్దకు వెళ్లాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. అంతేకాదు, సీఎన్ఎస్ ఫేక్ న్యూస్, వారితో నేను మాట్లాడనని రిపోర్టర్ మొహం మీదే చెప్పేయడం గమనార్హం. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత నాలుగు రోజులుగా అంతర్జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఆరోగ్యం విషమించిందని, కోమాలో ఉన్నారంటూ అనేక కథనాలు వినిపిస్తున్నాయి. సియోల్ కేంద్రంగా పనిచేసే డెయిలీ ఎన్‌కే వెబ్‌సైట్ కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి గురించి సోమవారం రాత్రి తొలిసారిగా ఓ కథనం ప్రచురించింది. ఆయన అనారోగ్యంతో ఏప్రిల్ 12 హాస్పిటల్‌లో చేరినట్టు తెలిపింది.
By April 24, 2020 at 11:16AM
No comments