Breaking News

నేడు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ తర్వాత కార్యాచరణ ఇదే!


కరోనా వైరస్ కట్టిడికి విధించిన రెండో దశ మరో వారం రోజుల్లో ముగియనుంది. ఏప్రిల్ 14న తొలి దశ లాక్‌డౌన్ తర్వాత కొన్ని కార్యకలాపాలు ప్రారంభానికి మినహాయింపులను ఇచ్చిన కేంద్రం.. రెండో దశ ముగియనుండగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకుంది. లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత ఎలా వ్యవహరించాలి? అనేది పెద్ద సవాల్. అయితే, మే 3 తర్వాత ఏం చేయాలనేదానిపై కేంద్రం ఇప్పటికే స్థూలంగా ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రిస్తూ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ ‘కనిష్ఠ చలనం... గరిష్ఠ పని’ అన్న నినాదంతో కేంద్రం ముందుకు సాగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ప్రణాళిక గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించిన తరువాతే కార్యాచరణ ప్రణాళికను కేంద్రం ఖరారు చేయనుంది. దశల వారీగా ఆంక్షలను సడలించాలని భావిస్తున్న కేంద్రం.. ఈ విషయంలో చర్యలు తీసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇవ్వనుంది. లాక్‌డౌన్ తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం కావడం ఇది మూడోసారి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో కొందరు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం ఉందని సమాచారం. పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో కార్మికులు, సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ షిఫ్టు వేళల్లో మార్పులు చేసే అవకాశం. ఈ విషయంలో పారిశ్రామిక సంస్థలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని అమలు చేయనుంది. గ్రీన్ జోన్‌లలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆర్థిక కార్యక్రమాలు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. ఏప్రిల్ 20 నుంచి గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కార్యకాలపాలు పునఃప్రారంభం కాగా.. ఆ తర్వాత కూడా మరికొన్ని విభాగాలకు కేంద్రం హోం శాఖ అనుమతి ఇచ్చింది. రెండు రోజుల కిందట మున్సిపాల్టీల వెలుపల ఉన్న దుకాణాల పునఃప్రారంభానికి మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు, మినహాయింపులపై కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 15న విడుదల చేసిన మార్గదర్శకాల అమలు తీరుపై ఆరా తీయనున్నారు. అలాగే, లాక్‌డౌన్ ముగిసిన మే 3 తరువాత ఏమి చేయాలనేదానిపై అభిప్రాయాలు తెలుకుంటారు.


By April 27, 2020 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-to-interact-with-cms-today-to-discuss-way-forward-after-lockdown/articleshow/75397976.cms

No comments