తబ్లీగ్ జమాత్ చీఫ్ సహా మరో ఆరుగురిపై కుట్రపూరిత హత్య కేసు
దేశంలో కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు ఓ కారణమయ్యాయి. మార్చి 1 నుంచి 15 వరకు తబ్లీగ్ జమాత్ నిర్వహించిన మతసమ్మేళనంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు సహా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేశంలో వైరస్ వ్యాపిస్తున్న తరుణంలోనే ఈ కార్యక్రమం జరగడంతో ఇందులో పాల్గొన్నవారు పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బారినపడ్డారు. వైరస్ ముప్పు గురించి ప్రభుత్వాలు హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రార్థనలు నిర్వహించిన తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కాంధ్వలీపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సాద్ ఉల్లంఘించారని, నిజాముద్దీన్ మర్కజ్‌లో మతపరమైన సమ్మేళనం నిర్వహించడం ద్వారా కరోనా బారినపడి పలువురు మృతికి కారకులయ్యారని అతడిపై నేరపూరిత హత్య కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు. సాద్‌తోపాటు మరో ఆరుగురిపై హత్యకేసు నమోదయ్యింది. నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కాంధ్వలీపై ఐపీసీ సెక్షన్ 304, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపై వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీస్ పీఆర్ఓ మనదీప్ రాంధ్వా తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది సలహ తీసుకునే ఈ కేసు నమోదుచేశామని పేర్కొన్నారు. మౌలానా సాద్‌పై ఇంతకు ముందే బెయిల్‌బుల్ కేసు నమోదు కాగా.. ప్రస్తుతం ఇది నాన్-బెయిల్‌బుల్ కేసుని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదయి.. నేరం నిరూపించబడితో 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. సాద్‌తో పాటు తబ్లీగ్ జమాత్ కమిటీలోని మరో 18 మందికి క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. వీరిలో 11 మంది ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. లాక్‌డౌన్ విధించినప్పటికీ ప్రధాన కార్యాలయంలో జమాత్ కార్యకలాపాలను కొనసాగించడానికి గల కారణాలు, హాజరైనవారి వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. తబ్లీగ్ చీఫ్ మౌలనా సాద్‌కు ఇప్పటికే పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. మొత్తం 26 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపగా.. ఇందులో కొన్నింటికి తన దగ్గర సమాధానాలు లేవని, తాను ప్రస్తుతం క్వారైంటన్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే, ప్రస్తుతం అతడి క్వారంటైన్ పీరియడ్ పూర్తికావడంతో స్టేట్‌మెంట్ తీసుకుని, అరెస్ట్‌కు పోలీసులు సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 28న ఓ ఆడియో విడుదల చేసిన మౌలానా సాద్.. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు పేర్కొన్నారు. తన లాయర్ ద్వారా పోలీసుల నోటీసుకు సమాధానం పంపాడు. పోలీసులు పిలిస్తే తప్పకుండా సాద్ హాజరవుతాడని లాయర్ స్పష్టం చేశారు. మర్కజ్‌కు హాజరైన 1,890 మందికి పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీచేశారు. వీరంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, గాలిస్తున్నారు.
By April 16, 2020 at 10:35AM
No comments