Breaking News

మద్యం లేక స్పిరిట్ తాగి.. ఇద్దరు యువకులు మృతి


లాక్ డౌన్‌తో మందుబాబులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మద్యానికి బానిసైన కొందరు మందుకు బదులు మత్తు కోసం రకరకాల రసాయనాలు తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మద్యం అలవాటున్న ఇద్దరు వ్యక్తులు మత్తు కోసం రసాయన ద్రావణంలో నీళ్లు కలుపుకుని తాగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన షేక్‌బాబా (35), రియాజ్ (22)లు ప్లాస్టిక్ బొమ్మలు విక్రయిస్తూ జీవిస్తుంటారు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో మంగళవారం రాత్రి వీరిద్దరూ ప్లాస్టిక్ డ్రమ్మును శుభ్రం చేసేందుకు రసాయన ద్రావణాన్ని ఉపయోగించారు. ఈ క్రమంలో అది స్పిరిట్ వాసన రావడంతో మత్తు కలిగిస్తుందన్న ఉద్దేశంతో అందులో నీళ్లు కలుపుకుని తాగారు. నిన్న ఉదయం వీరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరికీ తీవ్ర కడుపునొప్పి రావడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఏరియా ఆసుపత్రికి వెళ్లినా వాళ్లు స్పిరిట్ సేవించిన విషయం బయటకు చెప్పలేదు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు కూడా స్పిరిట్ తాగామన్న విషయాన్ని చెప్పకుండా దాచారు. నొప్పి పెరగడంతో ఇద్దరూ… తాము స్పిరిట్ తీసుకున్న విషయం వైద్యులకు చెప్పారు. ఈలోపే పరిస్థితి విషమించడంతో ఇద్దరూ ప్రాణాలు కొల్పోయారు.


By April 30, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/2-die-after-consuming-spirit-in-bhongir-telangana/articleshow/75463789.cms

No comments