Breaking News

‘కరోనా’ తర్వాత కాంప్రమైంజ్ కావాల్సిందే..!


కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు సర్వం బంద్ అయ్యాయి. బహుశా ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరేమో. ఈ కరోనా దెబ్బతో నిర్మాతలు ఇప్పట్లో కోలుకోలేరు. బహుశా సినిమా థియేటర్లకు జనాలు రావాలంటే ఇప్పట్లో అస్సలు అవ్వదు.. వచ్చే ఏడాది దాకా పరిస్థితులు అనుకూలించవ్. ఈ విషయాన్ని స్వయంగా పేరుమోసిన నిర్మాతలు చెబుతున్న మాటలే.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. లాక్ డౌన్ తర్వాత ఇప్పటి వరకూ అనుకున్న సినిమాలు.. కొత్తగా నిర్మించాలన్నా సదరు నిర్మాణ సంస్థలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. పారితోషికం, ఖర్చులు వగైరా విషయాల్లో ఇదివరకటిలా పరిస్థితులు ఉండవ్. అవసరమైతే పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. ఇదిగో ఇంత మాత్రమే ఇవ్వగలం అని నిర్మాతలు చెబితే మిన్నకుండా తీసుకోవాల్సందే.. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయ్. అయితే తాజాగా ఇదే విషయమై ప్రముఖ నటుడు, విలన్ పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్‌ పెదవి విప్పాడు. ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పారితోషికంపై చాలా నిశితంగా వివరించారు.

పారితోషికం విషయమై పెద్ద పెద్ద స్టార్‌లు కాంప్రమైజ్ కావాల్సిందే.. కచ్చితంగా అవుతారు కూడా అని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్మాతలకు.. ఎంత తీసుకోవాలో నటీనటులకు బాగా తెలుసన్నట్లుగా ప్రకాష్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. అనవసరంగా ఎవరూ ఇవ్వరు కదా..? అని ఆయన తెలిపారు. వాస్తవానికి ఎవరూ భారీ వేతనాలు తీసుకోవట్లేదని.. వాళ్లు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటున్నారని చెప్పారు. పరిస్థితుల దష్ట్యా.. మారిన సందర్భాల్లో ఎంత తీసుకుంటారో అంతే తీసుకుంటారని.. ఎవరి అర్హతను బట్టి వాళ్లు పారితోషికం తీసుకుంటారన్నారు. నిర్మాతలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరూ డిమాండ్ చేయలేరని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే కరోనాకు ముందు.. కరోనా తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులుంటాయని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.



By April 24, 2020 at 08:23PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/50753/actor-prakash-raj.html

No comments