Breaking News

చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఆదే నిజమైతే చర్యలు తీసుకోవాల్సిందే


కరోనాను చైనా వైరస్‌గా అభివర్ణిస్తూ డ్రాగన్‌పై ఇప్పటికే పెద్దన్న అమెరికా కారాలు మిరియాలు నూరుతోంది. వైరస్ గురించి ప్రపంచ దేశాలకూ చైనా సరైన సమాచారం ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, కరోనా వైరస్‌ వుహాన్ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చిందని ప్రచారం సాగుతోంది. చైనా తీర్పుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న అగ్రరాజ్యాధినేత .. మరోసారి డ్రాగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహమ్మారి వ్యాప్తికి చైనాయే కారణమని తెలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన దీనిని అంత తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు. శ్వేతసౌధంలో రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి విషయం తెలిసి కూడా చైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయితే చర్యలు ఉండాల్సిందే. 1917 తర్వాత కనీవినీ ఎరుగని ప్రాణనష్టానికి సంబంధించిన అంశం ఇది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చైనా విషయంలో తన వైఖరి మారిన విషయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా వ్యక్తంచేశారు. కరోనా వైరస్ వెలుగులోకి రాకముందు వరకు చైనాతో సత్సంబంధాలు ఉండేవని వ్యాఖ్యానించిన ట్రంప్.. విజృంభణ పరిస్థితుల్ని ఒక్కసారిగా మార్చేసిందని అన్నారు. తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేవన్నారు. కానీ, ఒక్కసారిగా ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చింది.. కాబట్టి కచ్చితంగా ఈ విషయంలో భారీ వ్యత్యాసమే ఉంటుందని స్పష్టం చేశారు. చైనాపై ఆగ్రహంగా ఉన్నారా..?అంటే కచ్చితంగా అవుననే అనాల్సి ఉంటుంది.. కానీ, ఇది సందర్భానుసారంగానూ ఆధారపడి ఉండొచ్చని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. వైరస్‌ వ్యాప్తి తొలినాళ్లలోనే తాము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చైనా అంగీకరించలేదని గుర్తుచేశారు. వైరస్‌ వల్ల పరిస్థితులు దారుణంగా ఉన్న విషయం వారు ముందే పసిగట్టి ఉంటారని.. అందుకే తమ జోక్యాన్ని వారు ఇష్టపడలేదని అన్నారు. ఇరాన్‌ను ఉటంకిస్తూ పరోక్షంగా చైనాను హెచ్చరించే ప్రయత్నం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మొత్తం పశ్చిమాసియానే తన గుప్పిట్లో పెట్టుకునే స్థితిలో ఇరాన్‌ ఉండేదని.. కానీ, ఇప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తోందని తెలిపారు. పరోక్షంగా అమెరికాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలకు దారితీస్తోందిన హెచ్చరించారు. కరోనా వైరస్ మరణాల సంఖ్య అమెరికా కంటే చైనాలోనే ఎక్కువగా ఉంటుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలున్న ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాల కంటే చైనాలో మరణాల రేటు తక్కువగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. చైనా వాస్తవాలు వెల్లడించలేదని, చెబుతున్న సంఖ్య అవాస్తమని ఆరోపించారు. కరోనా కేసులు, మరణాల సంఖ్యను చైనా సవరించిన విషయం తెలిసిందే.


By April 19, 2020 at 12:28PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-donald-trump-warns-china-of-consequences-if-found-responsible-for-covid-19/articleshow/75230576.cms

No comments