దేశంలో 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. నిన్న ఒక్క రోజే రికార్డ్‌స్థాయిలో మరణాలు
గడచిన 24 గంటల్లో కరోనా మరణాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 74 మంది కరోనా వైరస్‌తో మృత్యువాతపడ్డారు. దేశంలో వైరస్ మరణాలు 24 గంటల్లో ఇంతపెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా మహారాష్ట్రలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1080కి చేరింది. ముందు రోజుతో పోల్చితే పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదుకావడం కొంత సానుకూలంశం. దేశవ్యాప్తంగా 1,635 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇందులో 597 మహారాష్ట్రలోనే ఉన్నాయి. గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,045గా నమోదయ్యింది. ఇప్పటి వరకూ 8,439 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 24 శాతంగా ఉంది. ఢిల్లీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 125 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల తర్వాత పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే, వీరిలో వైద్య సిబ్బంది ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఎయిమ్స్‌లో ఓ నర్స్, మరో ముగ్గురు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లోనే 16 మంది, మధ్యప్రదేశ్‌లో 10 మంది, రాజస్థాన్ ముగ్గురు, తమిళనాడు, బెంగాల్ రెండు, కర్ణాటకలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. మహారాష్ట్రలో వరుసగా రెండో రోజూ 30 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మహారాష్ట్రలోనే పాజిటివ్ కేసులు 10వేలకు చేరువలో ఉన్నాయి. ఒక్క ముంబయి నగరంలోనే 6,644 మంది వైరస్ బారినపడ్డారు. ఆ రాష్ట్రంలోని కరోనా మరణాల్లో 80 శాతం ఆర్ధిక రాజధానిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 432 మంది చనిపోతే.. 272 మంది ముంబయిలోనే ఉన్నారు. మొత్తం పాజిటివ్ కేసులు 9,915గా నిర్ధారణ అయ్యాయి. దీని తర్వాత గుజరాత్ (4,082) ఉంది. ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. వరుసగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 73 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,332కి చేరింది. గుంటూరు జిల్లాలో 29, కృష్ణా జిల్లాలో 13, కర్నూలులో 11.. ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో నాలుగు చొప్పున.. చిత్తూరు జిల్లాలో మూడు, పశ్చిమగోదావరి జిల్లాలో 2.. తూర్పుగోదావరి , శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటి వరకూ 287 మంది కోలుకున్నారు. ఇంకా 1,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాలోనే కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా సింగిల్ డిజిట్ కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం శుభసూచకం. వరుసగా ఏడో రోజు కూడా స్వల్ప సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా ఏడుగురికి వైరస్ నిర్ధారణ అయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదైన బాధితులకు సంబంధించిన కుటుంబసభ్యులు, కాంటాక్ట్ వ్యక్తులకే కొత్తగా కరోనా నిర్ధారణ అవుతోందని.. ఇతరులెవరికీ వైరస్ సోకడంలేదని అన్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,016కి చేరాయి. మరో 35 మంది కోలుకున్నారు.
By April 30, 2020 at 07:46AM
No comments