Breaking News

కరోనా కట్టడికి ఇటలీ మరిన్ని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రూ.4లక్షల ఫైన్


ప్రపంచంలోనే అత్యధికంగా మరణాలు ఇటలీలోనే నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఆ దేశంలో వందలాది మందిని కోవిడ్-19 మహమ్మారి పొట్టనబెట్టుకుంటోంది. ఇప్పటి వరకూ 5,495 మంది మృతిచెందగా, బాధితుల సంఖ్య 60వేలకు చేరుకుంది. ఉత్తర ఇటలీలోని లొంబార్డే ప్రాంతంలో అత్యధికంగా 3,500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నియంత్రణకు ఇటలీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. కేవలం ఆరు కోట్ల జనాభా కలిగిన ఇటలీ ఇప్పుడు కరోనాతో ఎక్కడ చూసినా శవాలతో నిండిపోయింది. శవాలను పూడ్చిపెట్టడానికి స్థలం లేదు. బాధితులకు వైద్యం చేయడానికి హాస్పిటల్స్ సరిపోవడంలేదు. ఆరు బయటే టెంట్ వేసి వైద్యం చేసే దుస్థితి దాపురించింది. కరోనా వైరస్‌తో మరణించినవారిలో అత్యధికంగా 60 ఏళ్ళు దాటినవారే ఉన్నారు. జనవరి 29న ఇటలీలో తొలి కేసు నమోదు కాగా, మార్చి తొలివారం నాటికి మహమ్మారి ఉగ్రరూపం దాల్చి ఇటలీను చుట్టేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఇటలీ మరుభూమిగా మారిపోయింది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నా ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ఇటలీ ప్రధాని ఒకింత ఆవేదన వ్యక్తం చేయడం బాధాకరం. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఉత్పాదకతను తగ్గించిన ఇటలీ.. లాంబొర్డే ప్రాంతంలో పూర్తిగా పరిశ్రమలను మూసివేసింది. ఇక్కడ ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి రావద్దని ఆదేశాలు జారీచేసింది. ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగతంగా ఇతరులతో కలిసిమెలిసి ఉండరాదని స్పష్టం చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి. అయితే, ముఖ్యంగా వయోధికుల్లో న్యూమోనియా సహా కోవిడ్ తీవ్రత అధికంగా ఉంది. వైరస్ బారినపడ్డవారిలో 99వేల మంది కోలుకోగా, అధిక శాతం చైనావాసులే ఉన్నారు. డాగ్ వాకింగ్‌పై కూడా ఇటలీ ఆంక్షలు విధించింది. ఈ వాకింగ్‌లో పాల్గొనేవారు కనీసం 200 మీటర్ల దూరం పాటించాలని పేర్కొంది. బహిరంగ క్రీడలను నిషేధించడమే కాదు, ఇళ్లలోనూ ప్రాక్టీస్ చేయరాదని ఆదేశించింది. అయితే, దీనిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నిషేధం తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా ఉందని అంటున్నారు. లొంబొర్డే ప్రాంతంలో నిబంధలను అతిక్రమించినవారికి విధించే జరిమానాను అధికారులు 5,000 యూరోలకు పెంచారు.


By March 23, 2020 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-deaths-toll-rapidly-italy-restrictions-grow-more-specific-in-bid-to-slow-virus/articleshow/74768759.cms

No comments