Breaking News

ఇటలీలో కరోనా కరాళనృత్యం.. రెండు రోజుల్లో 1,400 మంది మృతి


కరోనా మహమ్మారి దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణుకుతోంది. మహోగ్రరూపం దాల్చడంతో వేలాది మంది బలవుతున్నారు. దేశం యావత్తూ నిర్బంధంలో ఉన్నా వైరస్ వ్యాప్తి మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఆరంభంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ఉపద్రవానికి దారితీస్తుందో మిగతా దేశాలకు ఇటలీ పరిస్థితి గుణపాఠం నేర్పుతుంది. ఇప్పటికే కోవిడ్-19 మరణాల్లో చైనాను మించిపోయిన ఇటలీలో శనివారం మరో 793 ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ ప్రభావం మొదలైన తర్వాత ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఒక్కరోజు ఇంతమంది మృత్యువాత పడలేదు. ఇటలీలో ఇప్పటి వరకు 4,825 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 6,557 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. ఒక్క ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే 3,000 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 10 రోజుల నుంచి ఇటలీ పూర్తిగా నిర్బంధంలోనే కొనసాగుతున్నా గత రెండు రోజుల్లో 1,420 మంది మృతిచెందడం గమనార్హం. సామాజిక దూరం లాంటి కట్టుబాట్లను ప్రజలు పాటిస్తున్నా వైరస్‌ విజృంభిస్తోంది. అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ వైరస్‌ను అడ్డుకోవడంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీన్ని బట్టి వైరస్‌ ఏ స్థాయిలోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువులను ఉత్పత్తిచేసే పరిశ్రమలు మినహా మిగతావాటిని మూసివేయాలని శనివారం ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అత్యవసర వస్తువులు, సేవలు మినహా అన్ని పరిశ్రమలను మూసివేస్తున్నట్టు ఇటలీ ప్రధాని ప్రకటించారు. నిత్యావసరాలు, ఔషధాలు దుకాణాలు తెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉత్పాదక మెల్లగా తగ్గిస్తాము కానీ, పూర్తిగా నిలివేయమని స్పష్టం చేశారు. ఇటలీలో నెల రోజుల కిందట తొలి మరణం చోటుచేసుకుంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అకారణంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారిపై అక్కడి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసర పని మీద బయటకు వచ్చామని పౌరులే నిరూపించుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలను ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వాకింగ్‌కు సైతం ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించారు. మృతుల సగటు వయసు 78.5 ఏళ్లుగా ఉన్నట్లు అక్కడి నేషనల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌లో వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నా ఆ దేశం తప్పుడు సమాచారం ఇస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


By March 22, 2020 at 09:52AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/italy-shuts-factories-after-more-than-1400-deaths-in-two-days-due-to-coronavirus/articleshow/74755703.cms

No comments