కరోనా వ్యాప్తికి ఈ జంతువే కారణం.. గబ్బిలాలు, పాములు కాదట!
చైనాలో కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రంగా ఉంది. శనివారం నాటికి ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 722కు చేరింది. అలాగే వైరస్ బాధితుల సంఖ్య 34,546కు చేరినట్టు అధికారులు తెలిపారు. గతంలో చైనాను కుదిపేసిన సార్స్ వైరస్ కారణంగా 700 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుత సంఖ్యకు మించి ప్రాణాలు పోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజులోనే 88 మంది మృతిచెందగా ఒక్క హుబె ప్రావిన్సుల్లోనే 85 మంది ఉన్నారు. మరోవైపు, వైరస్ సోకిందనే అనుమానంతో ఆస్పత్రుల్లో చేరినవారి పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఇంతవరకు 1540 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో నవజాత శిశువులో ఈ వైరస్ బయటపడింది. అటు ఐరోపా దేశాల్లోనూ ఈ వైరస్ సోకినవారి సంఖ్య 31కి చేరింది. కరోనా వైరస్‌పై డిసెంబరులోనే హెచ్చరించిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్ శుక్రవారం తెల్లవారుజామున దాని కారణంగానే ప్రాణాలు కోల్పోయిన వైనంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని, తదనంతర పరిస్థితిని ప్రశాంత చిత్తంతో, సహేతుకంగా చూడాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విజ్ఞప్తి చేశారు. వైరస్‌ను నివారించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను, ప్రారంభించిన ప్రజా యుద్ధాన్ని గమనించాలని ఆయన కోరారు. మరోవైపు, వైరస్ భయంతో పలు దేశాలు విమాన సర్వీసులను రద్దు చేయడంపై చైనా తీవ్ర నిరసన తెలుపుతోంది. ఈ చర్యలు ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడింది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి పాములు, గబ్బిలాలే కారణమని ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. అయితే, దీనికి (అలుగు) కారణమని చైనా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. దీని జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు అది 99 శాతం కరోనా తరహా వైరస్ బాధితుల నమూనాలతో సరిపోలినట్టు దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మొత్తం 1000కిపైగా జంతువుల నుంచి నమూనాలను సేకరించిన శాస్త్రవేత్తలు.. వాటి జన్యుక్రమాన్ని విశ్లేషించారు. ఇందులో పాంగోలిన్‌తో వైరస్ భాదితుల నమూనాలు సరిపోలాయి. చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో వీటి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఈ అధ్యయనాన్ని మాత్రం కొందరు నిపుణులు తప్పుబడుతున్నారు. జన్యు విశ్లేషణ ప్రకారం.. గబ్బిల్లాల్లోని 96 శాతం కరోనా తరహా వైరస్ బాధితుల నమూనాలతో సరిపోలినట్టు తేలింది. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో మాత్రం గబ్బిలాల నుంచి ఇది నేరుగా మానవులకు సోకదని గుర్తించారు. దీని మరో జంతువు కారణమని వారు భావించారు. ఇక, 2002-03లో చైనాలో స్వైరవిహారం చేసిన సార్స్ వ్యాధికి ప్రధాన కారణం పునుగు పిల్లి. దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుందని చైనీయులు అమితంగా ఇష్టపడతారు.
By February 08, 2020 at 09:19AM
No comments