Breaking News

జగన్ తర్వాత కేజ్రీవాల్ .. ఢిల్లీ ఫలితాలతో ప్రశాంత్ కిశోర్‌‌కు ఫుల్ డిమాండ్!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖరారైంది. 50కిపైగా స్థానాల్లో ఆ పార్టీ గెలుపు దిశగా సాగుతోంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి సీఎం కావడం దాదాపుగా ఖరారైంది. కేజ్రీవాల్‌ను ఓడించడం కోసం బీజేపీ సర్వశక్తులను ఒడ్డినప్పటికీ.. మెజార్టీ ఢిల్లీ ఓటర్లు మాత్రం ఆప్‌కే మద్దతుగా నిలిచారు. తమ పార్టీకి చెందిన సీఎంలు, మంత్రులు, మాజీ సీఎంలతో బీజేపీ ప్రచారం నిర్వహించింది. కానీ ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. గత ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ మార్క్ దాటే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. ఆప్ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నాయి. ఆప్ కార్యకర్తలతోపాటు ఆ పార్టీ కోసం పని చేసిన కూడా ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో హ్యాపీ అని చెప్పొచ్చు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పని చేసిన పీకే.. జగన్‌ను తిరుగులేని విజయంతో సీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అదే తరహాలో ఇప్పుడు కేజ్రీవాల్‌ విజయంలోనూ తన వంతు పాత్ర పోషించారు. ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీ తీవ్రంగా పోరాడినప్పటికీ.. మోదీ, అమిత్ షా లాంటి నేతలు ప్రచారం చేసినప్పటికీ.. కేజ్రీవాల్‌ వైపే జనం మొగ్గడానికి ప్రశాంత్ కిశోర్ ప్రచార వ్యూహాలు కూడా పని చేశాయి. గత కొంత కాలంగా కేజ్రీవాల్ ఎక్కడా జాతీయాంశాలను ప్రస్తావించడం లేదు. ఢిల్లీ అభివృద్ధి గురించి, అక్కడి ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఎన్ఆర్సీ ఆందోళనలు కూడా ఆమ్ ఆద్మీకి కలిసొచ్చాయి. అదే సమయంలో ఎన్ఆర్సీకి అనుకూలంగా ఉన్నవారి మద్దతు కోల్పోకుండా ఉండటం కోసం కేజ్రీవాల్ ఢిల్లీ గురించే మాట్లాడారు. ఆప్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ పీకే కీలక పాత్ర పోషించారని సమాచారం. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్.. మరుసటి ఏడాది బిహార్లో నితీశ్ కుమార్ సీఎం కావడంలో ముఖ్య పాత్ర పోషించారు. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన ఆయన.. యూపీలో కాంగ్రెస్ కోసం పని చేసినా ఫలితం లేకపోయింది. ఏపీలో జగన్ గెలిచాక ప్రశాంత్ కిశోర్, ఐప్యాక్ టీంకు భారీగా డిమాండ్ పెరిగింది. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం ఆయన సేవలు అందించనున్నారు. తమిళనాడులోనూ పీకేతో కలిసి పని చేయడం కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ విజయంతో ప్రశాంత్ కిశోర్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.


By February 11, 2020 at 10:34AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/delhi/news/delhi-election-results-political-strategist-prashant-kishor-helps-arvind-kejriwal-to-retain-cm-post/articleshow/74075717.cms

No comments