నిర్భయ దోషులకు ‘ఉరి’ వాయిదా.. వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు సాధ్యమైనంత తర్వగా శిక్షను అమలుజరిగేలా చూడాలని ఉప-రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలు సుదీర్ఘకాలం కొనసాగడాన్ని అనుమతించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయడంలో జరుగుతున్న జాప్యంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్.. వారికి వెంటనే శిక్ష అమలయ్యేలా చూడాలని రాజ్యసభ ఛైర్మన్‌కు విన్నవించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ... శిక్ష అమలులో జరుగుతున్న జాప్యం చాలా తీవ్రమైన, సున్నితమైన అంశమని అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకుందని, కారణం ఏదైనా తాను వ్యక్తులు, వ్యవస్థల పేర్ల గురించి ప్రస్తావించదలచుకోలేదని వెంకయ్య తెలిపారు. ఇలాంటి విషయాలు దీర్ఘకాలం కొనసాగడాన్ని అనుమతించకూడదని వెంకయ్య పేర్కొన్నారు. దోషులకు న్యాయపరంగా అన్ని అవకాశాలను ఇచ్చారని, అవన్నీ పూర్తయినా కూడా ఏదో ఒక వంకతో వాయిదా వేసుకుంటూపోతే ప్రజలు అసహనానికి గురవుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ఈ కేసులో తీర్పును సాధ్యమైనంత త్వరగా అమలుచేయడానికి చర్యలు తీసుకోవాలని వెంకయ్య సూచించారు. నిర్భయ దోషులకు ఉరి అమలులో జరుగుతున్న జాప్యంపై రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని ఆప్ ఎంపీ డిమాండ్ చేశారు. నిర్భయకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారని, దోషులు మాత్రం రోజుకో ఎత్తుగడతో శిక్ష అమలును వాయిదా వేయించుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉండగా, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యానికి ఢిల్లీ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ ఆరోపించారు.
By February 05, 2020 at 10:32AM
No comments