Breaking News

నిర్భయ దోషులకు ‘ఉరి’ జాప్యం.. మరణశిక్షలపై సుప్రీం కీలక ఆదేశాలు


నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై న్యాయస్థానాలతో సహా ప్రజల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక మార్గదర్శకాలను జారీచేసింది. మరణశిక్ష పడిన కేసుల్లో జాప్యాన్ని నివారించేందుకు కింది కోర్టుల తీర్పులను సవాల్ చేస్తూ దాఖలయ్యే ఆపీళ్ల విచారణకు గడువు విధించింది. ఉరిశిక్ష కేసుల్లో అపీళ్ల విచారణ గరిష్ఠంగా ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఉరిశిక్షను హైకోర్టు సమర్ధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసిన రోజు నుంచి 6 నెలల్లోపే దాన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్టు చేయాలి. ఆ అపీలు సిద్ధమైందా.. లేదా.. అన్నదానితో సంబంధం లేకుండా ఈ పనిని పూర్తి చేయాలని సుప్రీం పేర్కొంది. మరణశిక్ష అంశంతో ముడిపడిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైన వెంటనే ఏ హైకోర్టు నుంచి ఆ కేసు అపీల్‌ వచ్చిందో దానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ రెండు నెలల్లోగా వర్తమానం పంపాలి. సుప్రీం నుంచి సమాచారం అందిన నెల రోజుల్లోపు కానీ, కోర్టు నిర్దేశించిన గడువులోగా కానీ ఆ కేసుకు సంబంధించిన రికార్డు, ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ సర్వీసు’ను సదరు న్యాయస్థానం పంపేలా చూడాలి. ఆ రికార్డుతోపాటు అదనపు పత్రాలు, ప్రాంతీయ భాషల్లో ఉన్న దస్తావేజులను ట్రాన్స్‌లేషన్ చేసి పంపాల్సిన అవసరం ఉంటే అదనంగా మరో 30 రోజులు గడువును నిర్దేశించాలని తెలిపింది. అపీల్‌పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించిన వెంటనే.. కేసుతో సంబంధం ఉన్నవారు 30 రోజుల్లోపు అఫిడ్‌విట్ దాఖలు చేసేలా రిజిస్ట్రీ ఒత్తిడి తీసుకురావాలని సూచించింది. నిర్దేశిత గడువులోపు రికార్డులు, అదనపు దస్తావేజులు అందజేకపోయినా నివేదికను తయారుచేసి తదుపరి ఆదేశాల కోసం సదరు కేసును విచారిస్తోన్న న్యాయమూర్తుల ఛాంబర్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఇలాంటి కేసులను రిజిస్ట్రార్‌ లిస్టు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇకపై ఈ కొత్త విధానం అనుసరించాలని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.


By February 15, 2020 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-delay-on-nirbhaya-convicts-hanging-supreme-court-issues-guidelines-to-speed-up-death-penalty-cases/articleshow/74144337.cms

No comments