Breaking News

నేటితో పుల్వామా దాడికి ఏడాది.. ఉగ్ర ఘాతుకానికి 40 మంది సైనికులు బలైన రోజు


సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ()కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్‌ను వినియోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యారు. పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. సీఆర్పీఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్, తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతీపొర సమీపంలో లాటూ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది, మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది, సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమేరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. అందుకు మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఎంచుకుంది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్‌ స్ట్రయిక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. బాలాకోట్ ఎయిర్‌ స్ట్రయిక్స్ తర్వాత దాయాదుల మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. అయితే, వీటిని భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది.


By February 14, 2020 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-year-of-pulwama-terror-attack-on-crpf-convoy-how-india-witnessed-a-black-day-on-february-14th/articleshow/74127116.cms

No comments