చైనాలో 1000కి చేరిన కరోనా మృతులు.. కోలుకుంటున్న కేరళ బాధితురాలు!
చైనాలో మరణమృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1,000కి చేరింది. ఒక్క హుబే ప్రావిన్సుల్లోనే సోమవారం 103 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ మొదలైన తర్వాత ఒక్క రోజు ఇంతపెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. రోజు రోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు చైనా వెలుపల కూడా దీని కేసులు పెరుగుతుండటంతో పెద్ద ఉపద్రవం ముంచుకురానుందని హెచ్చరించింది. అంతేకాదు, ఈ మహమ్మారిని అదుపుచేయడంలో మానవాళి వెనుబడకూడదని పేర్కొంది. వైరస్‌కు కేంద్రమైన హుబే ప్రావిన్సుల్లోనే మరణాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం 91 మంది ప్రాణాలు కోల్పోగా, సోమవారానికి అది 103కి చేరింది. అలాగే కొత్తగా మరో 2,097 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 42వేలకు చేరుకుంది. ఆదివారం నాటితో పోల్చితే ఈ సంఖ్య తక్కువే కావడం ఊరట కలిగించే అంశం. ఆదివారం 2,618 కరోనా కేసులు నమోదు కాగా, సోమవారం నాడు 2,092 మాత్రమే నమోదయ్యాయి. తొలిసారి కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. డబ్ల్యూహెచ్ఓ, చైనా అధికారుల ప్రకారం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 42వేలకు చేరుకున్నాయి. ఇందులో 319 కేసులు చైనా వెలుపల 24 దేశాల్లో నమోదయ్యాయి. మరోవైపు, యెకహోమా తీరంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెన్స్ నిర్బంధం కొనసాగుతోంది. ఈ నౌకలోని 135 మంది కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. కాగా, భారత్‌లో నమోదైన తొలి కరోనా వైరస్ కేసు బాధితురాలు కోలుకుంది. కేరళకు చెందిన వైద్య విద్యార్ధిని ఆ మహమ్మారి నుంచి కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె రక్త నమూనా పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా తేలినట్లు వైద్యాధికారులు సోమవారం వెల్లడించారు. వుహాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళకు జనవరి 10న పరీక్షలు నిర్వహించిగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని, దీంతో అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు వివరించారు. తాజాగా ఆమె రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. ఫలితాల్లో కరోనా వైరస్ నెగెటివ్‌గా వచ్చినట్ుట అధికారులు తెలిపారు. అయితే ఎన్‌ఐవీ నుంచి వచ్చే రిపోర్టు కోసం వైద్యులు వేచిచూస్తున్నారు. కేరళ మొత్తం మీద 3వేలకు పైగా వ్యక్తుల్ని పరిశీలనలో ఉంచామని, మరో 34 మందిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
By February 11, 2020 at 09:02AM
No comments