Breaking News

కీలక మలుపు తిరిగిన జేఎన్‌యూ ఘటన. అయిషీ ఘోష్‌ పాత్ర ఉందన్న పోలీసులు!


గత ఆదివారం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి విద్యార్థులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రతిపక్షాలు, సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. బాలీవుడ్ నటి దీపికా పదుకునే నేరుగా జేఎన్‌యూకి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దాడికి పాల్పడిన తొమ్మిది మంది అనుమానితుల ఫొటోలను విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు... ఇందులో జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ అయిషీ ఘోష్‌ పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమెకు సంబంధించిన ఫొటోను పోలీసులు చూపించారు. జనవరి 5న సాయంత్రం జేఎన్‌యూ పెరియార్‌ హాస్టల్‌‌లో అయిషీ ఘోష్‌తో పాటు మరికొందరు దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్‌ ఫీజులు పెంచినందుకు నిరసనగా క్యాంపస్‌లో విద్యార్థి సంఘాలు దాడికి పాల్పడ్డాయని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో వామపక్ష విద్యార్ధి సంఘాలకు చెందినవారు ఏడుగురు, ఏబీవీపీకి చెందిన ఇద్దరు ఉన్నారన్నారు. జేఎన్‌యూ పూర్వ విద్యార్ధి చున్‌చున్‌ కుమార్‌, పంకజ్‌ మిశ్రా, అయిషీ ఘోష్‌, వస్కర్‌ విజయ్‌, సుచేత తలుక్దర్‌, ప్రియా రంజన్‌, దోలన్‌ సావంత్‌, యోగేంద్ర భరద్వాజ్‌, వికాస్‌ పాటిల్‌‌లు ఈ దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వామపక్ష విద్యార్ధి సంఘాలకు చెందిన వారు జేఎన్‌యూలోని సర్వర్‌ రూమ్‌ను ధ్వంసం చేశారని, దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు లేకపోవడం వల్ల నిందితులను గుర్తించడం కష్టమైందని వివరించారు. ఈ ఘటనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ ప్రాథమిక దశలోనే ఉందని ఇంత వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. ఘటన జరిగిన రోజు ఉదయం, దానికి ముందు రోజుల్లో జరిగిన సంఘటనలు ఆధారంగా పోలీసులు దీనిపై నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, పోలీసులు తనపై చేసిన ఆరోపణలను జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి దాడికీ పాల్పడలేదని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టిస్తూ తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఘోష్ ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. అంతేకాదు, చట్టం మీద నాకు పూర్తి నమ్మకం ఉందని, నాకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించింది. కానీ పోలీసులు ఇలా నా మీద ఎందుకు నేరం మోపుతున్నారు? నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. నేను ఎటువంటి దాడికి పాల్పడలేదని ఆమె తెలిపారు.


By January 11, 2020 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-police-point-finger-at-mostly-left-groups-at-jawaharlal-nehru-university/articleshow/73198233.cms

No comments