Breaking News

నిర్బంధం నుంచి ఫరూక్ అబ్దుల్లాకు విముక్తి.. బ్రిటన్‌కు పంపే యోచనలో ప్రభుత్వం!


గతేడాది ఆగస్టు 5 నుంచి గృహనిర్బంధంలో ఉన్న నేత , ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాలను త్వరలో విడుదల చేయనున్నారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితులను తెలుసుకోడానికి విదేశీ రాయబారులు రెండు రోజుల పర్యటనకు వచ్చిన మర్నాడే కేంద్రం సంకేతాలిచ్చింది. నేషననల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా‌లు కొంత కాలం క్రియాశీల రాజకీయాల నుంచి దూరంగా ఉంటామని హామీ ఇస్తే వారిని నిర్బంధం నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రతిపాదన ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆయనకు దీని గురించి తెలియజేస్తామని ప్రభుత్వంలో అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు, ఫరూక్ అబ్దుల్లాను కొంతకాలం బ్రిటన్‌కు ప్రవాసం పంపాలనే ఆంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించాయి. ఏది ఏమైనా తమ అనుచరుల ద్వారా పార్టీ కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దుచేసిన కేంద్రం, అక్కడ కీలక రాజకీయ నేతలను నిర్బంధంలోకి తీసుకుంది. అప్పటి నుంచి వీరి నిర్బంధం కొనసాగుతోంది. తాజాగా, సుప్రీంకోర్టు సైతం కశ్మీర్‌లో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సీనియర్ లాయర్ నజీర్ అహ్మద్ రోంగా సహా 26 మందికి గతంలో జారీచేసిన నిర్బంధ వారెంట్లను జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం శుక్రవారం రద్దుచేసింది. కశ్మీర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న రోంగా.. వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నేత మిర్వాజ్ ఉమర్ ఫరూకీకి అత్యంత సన్నిహితుడు. కశ్మీర్‌లో పరిస్థితులపై వారంలోగా సమీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన కొద్ది క్షణాల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


By January 11, 2020 at 12:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/govt-deal-in-works-for-release-of-jammu-and-kashmir-leaders-farooq-abdullah-and-his-son/articleshow/73200128.cms

No comments