Ram Mandir Verdcit Live: అయోధ్య తీర్పు లైవ్ అప్డేట్స్.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోయే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా అయోధ్య, యూపీలోని కీలక ప్రాంతాల్లో భారీగా పారామిలటరీ దళాలను మోహరించారు. ఆయోధ్య పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 వేల మందిని భద్రతకు నియమించారు ముందు జాగ్రత్త చర్యగా ఉత్తరప్రదేశ్ సహా ఢిల్లీ, మధ్యప్రదేశ్లో విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించగా, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు కూడా పాఠశాలలకు శనివారం సెలవులు ప్రకటించాయి. భరత్పూర్ సహా మరికొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. అలాగే జైసల్మేర్లో నవంబరు 30 వరకు 144వ సెక్షన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. తీర్పు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనని భావించిన ప్రజానీకం నిత్యావసరాలను ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎంల వద్ద కూడా బారులు తీరారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైతే ఇబ్బందులు తప్పవని ఆహారం, మందుల, ఇంధనం తదితరాలను కొనుగోలు చేస్తున్నారు. తీర్పు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ).. అధికారులను అందుబాటులో ఉండాలని ఆదేశించింది. స్థానిక పోలీసులతో కలిసి సమన్వయం చేసుకోవాలని తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏదైనా అనుకోని ఘనటలు చోటుచేసుకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కేస్ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది.
By November 09, 2019 at 09:25AM
No comments