Breaking News

మహా రాజకీయాల్లో మరో ట్విస్ట్... సీఎంగా ఉద్ధవ్ రేపే ప్రమాణస్వీకారం!


ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్య మలుపులతో యావత్తు దేశాన్ని తనవైపు తిప్పుకున్న మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టు తీర్పుతో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూణ్ణాల ముచ్చటగానే మిగిలిపోయింది. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ తన మనసు మార్చుకుని సొంతగూటికి చేరుకోవడంతో కమలనాథులకు భంగపాటు తప్పలేదు. మెజార్టీ లేకపోయినా నెగ్గుకురాగలమనే ధీమాతో ఆగమేఘాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఫడ్నవీస్ దిగిపోక తప్పలేదు. మహారాష్ట్రలో ఏ క్షణాన ఏ జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీ సైతం మారింది. డిసెంబరు 1న మహావికాస్ అఘాడీ తరఫున నేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. అయితే, గవర్నర్‌తో భేటీ తర్వాత నవంబరు 28న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని మంగళవారం అర్ధరాత్రి తెలియజేశారు. మహావికాస్ అఘాడీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఎన్నికైన అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన నేతలతో కలిసి గవర్నర్‌ కోశ్యారీతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు నేతలు గవర్నర్‌తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో నవంబరు 28న ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్‌ ఉద్ధవ్‌ను కోరారు. ఈ అంశంపై కూటమి నేతలతో కలిసి చర్చించి నిర్ణయం చెప్తామని ఆయన గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌ అభిప్రాయాన్ని కూటమి నేతలకు తెలియజేయడంతో వారు దీనికి అంగీకరించారు. దీంతో ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ శాసనసభ పక్షనేత జయంత్‌పాటిల్‌ వెల్లడించారు. గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్‌లోని శివాజీపార్క్‌లో ప్రమాణస్వీకారం ఉంటుందని వెల్లడించారు.


By November 27, 2019 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/shiv-sena-chief-uddhav-thackeray-take-oath-as-cm-of-maharashtra-on-november-28/articleshow/72250763.cms

No comments