Breaking News

Chandrababu Naidu: మోదీ కేబినెట్ ప్రక్షాళన.. బాబు సన్నిహితుడికి కీలక పదవి!


వంద రోజుల పాలన ముగిసిన సందర్భంగా.. కేబినెట్‌ ప్రక్షాళన దిశగా మోదీ సర్కారు యోచిస్తోంది. మరో 15 రోజుల్లో కేబినెట్ ప్రక్షాళన ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా సురేశ్ ప్రభుకి తిరిగి అవకాశం దక్కొచ్చనే ప్రచారం బలంగా జరుగుతోంది. మోదీ తొలి మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో పని చేసిన సురేశ్ ప్రభును రెండోసారి అధికారంలోకి వచ్చాక పక్కనబెట్టారు. ప్రస్తుతం పీయూష్ గోయల్ నిర్వహిస్తోన్న వాణిజ్యం, పరిశ్రమల శాఖ బాధ్యతలను సురేశ్ ప్రభుకి అప్పగించే అవకాశం ఉందని సమాచారం. మోదీ తొలి కేబినెట్‌లో ముందుగా రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన .. అనంతరం వాణిజ్యం, పరిశ్రమల శాఖ బాధ్యతలను పర్యవేక్షించారు. ఇటీవల జీ20 సదస్సులో షెర్పాగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఆర్థిక మాంద్యం ముంగిట దేశ ఆర్థిక వ్యవస్థ ఉండటంతో.. సమర్థుడైన సురేశ్ ప్రభును తిరిగి కేబినెట్‌లో తీసుకోవాలని మోదీ యోచిస్తున్నారట. సురేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్య సభకు ఎంపికైన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇరు పార్టీల మధ్య స్నేహంలో భాగంగా.. సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపడానికి అంగీకరించారు. ఏపీ కోటా నుంచి పెద్దల సభకు ఎన్నికైన సురేశ్ ప్రభు.. చంద్రబాబుపై అనేకసార్లు ప్రశంసలు గుప్పించారు. బీజేపీ, టీడీపీ మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉన్న సమయంలోనూ ఆయన చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తారు. దేశంలో బెస్ట్ సీఎం బాబు అంటూ ప్రశంసించారు. సురేశ్ ప్రభును మోదీ రెండోసారి పక్కనబెట్టడానికి చంద్రబాబుతో స్నేహం కూడా కారణమనే ప్రచారం జరిగింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సురేశ్ ప్రభుకు మోదీ కేబినెట్‌లో చోటు దక్కుతుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి ఎవరికీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆంధ్రాకు చెందిన బీజేపీ నేతకు కూడా మంత్రి పదవి దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో రామ్ మాధవ్ ముందు వరుసలో ఉన్నారని.. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి కూడా పోటీలో ఉన్నారని టాక్. వీరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.


By October 04, 2019 at 11:22AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/modi-cabinet-reshuffle-suresh-prabhu-likely-to-come-back/articleshow/71435274.cms

No comments