Breaking News

ఎంపీడీవోపై దౌర్జన్యం కేసు.. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్


వెంకటాచలం ఎంపీడీవో సరళపై దౌర్జన్యం కేసులో గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తనపై దౌర్జ్యనం చేసి బెదిరించారని నెల్లూరు జిల్లా వెంకటాచలం మహిళా ఎంపీడీవో పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం అర్ధరాత్రి దీక్ష చేశారు. వెంకటాచలం మండలం గొలగమూడి వద్ద ఓ ప్రైవేటు లేఅవుట్‌కు సంబంధించి పంచాయతీ పైపులైను కనెక్షన్‌ కావాలని తనకు దరఖాస్తు చేసుకున్నారని.. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు, నియామకాల్లో తీరిక లేకుండా ఉండటంతో పరిశీలించడం ఆలస్యమైందని ఎంపీడీవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌లో బెదిరించారని, శుక్రవారం రాత్రి కల్లూరుపల్లిలోని తన నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను బెదిరించారని ఎంపీడీవో ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు శ్రీకాంత్‌రెడ్డిపై ఐపీసీ 448, 427, 290, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డీజీపీతో చర్చించినట్లు సమాచారం. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టాన్ని ధిక్కరించే వారు ఎవరైనా ఉపేక్షించొద్దన్నట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ నెల్లూరు పోలీసులకు అదేశాలిచ్చారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి దాటాక డీఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఎమ్మెల్యే నివాసముండే నెల్లూరులోని సాయి ఆశ్రయ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. కాసేపు చర్చల తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు.


By October 06, 2019 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ysrcp-mla-kotamreddy-sridhar-reddy-arrested-for-assault-on-venkatachalam-mpdo/articleshow/71461487.cms

No comments