Breaking News

YS Jagan సర్కారుకు తెలీకుండా ఆళ్లగడ్డలో యురేనియం డ్రిల్లింగ్.. పవన్ ప్రశ్నల వర్షం


నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గళం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ కాంగ్రెస్ నేతలతో కలిసి పవన్ డిమాండ్ చేశారు. దీంతో యురేనియం తవ్వకాలకు తాము అనుమతించలేదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇదే విషయమై పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రాంతంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ ప్రారంభమైందని ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. ‘‘ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ జరుగుతోందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ఏపీ సర్కారుకు తెలియకుండా ఇదెలా జరుగుతుంది? జిల్లా కలెక్టర్‌కు ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది’’ అని ట్వీట్ చేశారు. నల్లమల పరిసర ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామని, వారి తరఫున జనసేన పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ భరోసానిచ్చారు. నల్లమల అడవులను కాపాడటం కోసం తెలంగాణకు చెందిన విమలక్క రూపొందించిన బతుకమ్మ పాటను ట్వీట్ చేసిన పవన్.. నల్లమల కోసం విమలక్క పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆళ్లగడ్డలో ఏం జరుగుతోంది..? కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల కేంద్రం నుంచి మహానంది మండలంలోని గాజులపల్లి వరకు యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు మొదలయ్యాయి. అణు విద్యుత్ కార్పొరేషన్ సంస్థ అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో నల్లమలకు ఆనుకొని ఉండే గ్రామాల్లో 15 చోట్ల యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులను చేపట్టారు. రాళ్లు, మట్టి లాంటి శాంపిళ్లను సేకరించడం కోసం 250 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తున్నారు. అనంతరం వీటిని లాబొరేటరీకి పంపిస్తారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు శాంపిళ్లలో యురేనియం ఆనవాళ్లు కనిపిస్తే.. అక్కడ తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. కాగా ఖనిజాల అన్వేషణ కోసం జరిపే తవ్వకాల్లో ఇది భాగమని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.


By September 29, 2019 at 10:55AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/drilling-for-uranium-begins-at-allagadda-pawan-kalyan-demands-clarity-from-ys-jagan-govt/articleshow/71357515.cms

No comments