Chiranjeevi: రేపే ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా?


మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారంగ్రాండ్‌గా ఏర్పాటుచేయనున్నారు. వేడుకకు ఎవరు ముఖ్య అతిథిగా రాబోతున్నారో తెలుసా.. ఇంకెవరు చిరు సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. అసలైతే సైరా ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడో జరగాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి మెగా అభిమానులకు సెలవు రోజే ఈ వేడుకను చూసే అవకాశం దక్కింది. పవన్ కల్యాణ్ ఈ సినిమా కోసం తనవంతు ప్రచారం కల్పిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు గెస్ట్‌గా వచ్చి మెగా అభిమానులను మరింత ఉత్సాహపరచనున్నారు. ఆయన రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సోదరులు, వారి పిల్లలు, ఇతర హీరోలు ఈవెంట్‌కు గెస్ట్‌గా రమ్మంటే కాదనకుండా వస్తుంటారు. పవన్ ప్రీ రిలీజ్, ఆడియో ఈవెంట్లకు హాజరవడం వల్ల ఎన్నో చిన్న సినిమాలకు మంచి ప్రచారం లభించింది. ఇక అన్నయ్య నటించిన సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదనుకోండి. ఈ చిత్రంలో నయనతార చిరంజీవి జోడీగా నటించారు. తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పటివరకు సైరా ట్రైలర్‌ను కోటి మందికి పైగా వీక్షించారు. 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన తెలుగు ట్రైలర్లలో సైరా మూడో స్థానంలో నిలిచింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


By September 21, 2019 at 11:35AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-starrer-sye-raa-narasimha-reddy-pre-release-event-to-take-place-tommorow-pawan-kalyan-to-grace-the-event/articleshow/71230437.cms

No comments