ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్ఛొద్దు.. కేసీఆర్ సర్కారుకు హైకోర్టు షాక్
నూతన అసెంబ్లీ నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. అసెంబ్లీ నిర్మాణం కోసం.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఎర్రమంజిల్‌లో శాసన సభ భనవ నిర్మాణం కోసం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. వారసత్వ కట్టడాల పరిధిలోకి వచ్చే ఎర్రమంజిల్ భవనాలను.. ఆ జాబితా నుంచి తొలగించే సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, నిబంధలను పట్టించుకోలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం 111 పేజీల తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చివేసి, అక్కడ అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జితేంద్రబాబు, ఎర్రమంజిల్ ప్యాలెస్ నిర్మించిన నవాబు వారసుడు డాక్టర్ మిర్ ఆస్గార్ హుస్సేన్, సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, ఉస్మానియా విద్యార్థి జె.శంకర్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా 8 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటి విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత నిర్ణయం తీసుకునే ముందు హెచ్‌ఎండీఏ నుంచి ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎర్రమంజిల్ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం హెచ్‌ఎండీఏ చట్టాన్ని విస్మరించిందనే వాదనతో ఏకీభవించింది. పట్టణాభివృద్ధి చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం.. నిబంధన 13 తొలగింపు అధికారం హెచ్‌ఎండీఏకు మాత్రమే ఉందని తెలిపింది. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయ సమీక్ష చాలా పరిమితం అని.. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.
By September 17, 2019 at 09:25AM
No comments