Breaking News

కోడెల తప్పు చేసి చనిపోలేదు.. దేశంలో ఇదే తొలిసారి.. చంద్రబాబు ఆవేదన


పల్నాడు టైగర్‌గా గుర్తింపు పొందిన కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోడెలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించారని.. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల లాంటి వ్యక్తే అవమానాలను భరించలేకపోయారని.. ఆయన మరణం బాధాకరమన్నారు. ఓ సీనియర్‌ నేత ఆత్మహత్య చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని బాబు తెలిపారు. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆయన టెర్రరిస్ట్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా పని చేసిన కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని చంద్రబాబు ఆరోపించారు. కోడెల లాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. ఓ నాయకుడు ఈ విధంగా బాధపడుతూ బలవన్మరణానికి పాల్పడితే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 11 కేసుల్లో ముద్దాయి అయిన జగన్ ఇతరులపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘అసెంబ్లీ ఫర్నీచర్ తీసుకెళ్లారని కోడెలపై కేసులు పెట్టారు. కానీ ఫర్నీచర్ తీసుకెళ్లాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. ఏదైనా డ్యామెజీ అయితే డబ్బులు చెల్లిస్తానని కూడా చెప్పారు. కానీ చెప్పినప్పటికీ జగన్ ప్రభుత్వం వినిపించుకోలేద’’ని బాబు ఆరోపించారు. అన్నారు. కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ కోసం.. కోడెలపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు. ‘‘కోడెలపై 19 కేసులు పెట్టారు. పాత కేసులు తిరగదోడారు. కోడెలకు వ్యతిరేకంగా కేసులు వేయాలని.. ట్విట్టర్‌లో, పేపర్‌లో విజయసాయిరెడ్డి ప్రకటనలు చేశారు. సాక్షి పత్రికలో కోడెలను విమర్శిస్తూ కథనాలొచ్చాయి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టించారు. డీజీపీని కలిసినా ఫలితం లేకపోయింది’’ అని చంద్రబాబు చెప్పారు.


By September 17, 2019 at 09:44AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ysrcp-govt-tortured-kodela-siva-prasada-rao-says-tdp-chief-chandrababu-naidu/articleshow/71161311.cms

No comments