ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన మంచు మనోజ్.. ఈసారి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌తో..!
మంచువారి చిన్నబ్బాయి మనోజ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు అయిపోయింది. ‘‘అన్న మీ నెక్ట్స్ సినిమా ఎప్పుడు?’’ అని ఆయన అభిమానులు ట్విట్టర్‌లో అడుగుతూనే ఉన్నారు. ‘‘త్వరలో తమ్ముడు..’’ అని మనోజ్ చెబుతూనే ఉన్నారు. కాలం గడిచిపోతోంది కానీ, మనోజ్ సినిమాను ప్రకటించడం మాత్రం జరగడంలేదు. అయితే, ఎట్టకేలకు మనోజ్ ఒక సినిమాను అంగీకరించారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. శ్రీకాంత్ అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ చెప్పిన కథ మనోజ్‌కు బాగా నచ్చిందట. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను మనోజ్ ఓకే చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా కోసమే సిద్ధమవుతున్నారు.. మేకోవర్ కోసం కష్టపడుతున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్ర విశేషాలను అధికారికంగా వెల్లడించనున్నారట. తాను బ్రేక్ తీసుకోవడానికి కారణం గత చిత్రాల ఫలితాలు కాదని, అంతకు మించి లోతైన కారణం ఉందని, త్వరలోనే మీకు తెలుస్తుందని మనోజ్ ఇటీవల ట్వీట్ చేశారు. ప్రస్తుతం వస్తోన్న టాక్‌కు ఈ ట్వీట్ ఊతమిస్తోంది. కాగా, డైరెక్టర్ శ్రీకాంత్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో నిమగ్నమై ఉన్నారట. ప్రస్తుతం చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉందని, అక్టోబర్‌లో పూజా కార్యక్రమాన్ని జరిపి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాగా, మంచు మనోజ్ నుంచి హిట్ సినిమా వచ్చి నాలుగేళ్లకు పైగా అవుతుంది. ‘కరెంట్ తీగ’ తరవాత మనో మళ్లీ విజయాన్ని అందుకోలేదు. 2017లో వచ్చిన ‘గుంటూరోడు’, ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. మరి, ఈసారి ఎలాంటి స్క్రిప్ట్‌ను ఎంపిక చేసుకున్నారో చూడాలి.
By September 03, 2019 at 11:53AM
No comments