Breaking News

జగన్.. వైఎస్ పేరు వద్దు, మోదీ పేరు పెట్టు.. కన్నా డిమాండ్!


జగన్ సర్కారు అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 పెట్టుబడి సాయం అందజేయనున్నారు. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసాగా నామకరణం చేశారు. రైతుపక్షపాతిగా పేరొందిన వైఎస్ పేరును ఈ పథకానికి పెట్టడం సరైందేనని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రైతు భరోసా విషయమై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘జగన్ మీరు మరో స్టిక్కర్ సీఎం కాకండి. మ్యానిఫెస్టోలో మీరు రైతులకు రూ.12500 ఇస్తానని ప్రకటించారు. కానీ నేడు మోదీ గారు రైతులకు ఇచ్చే రూ.6000 లను కలుపుకుని 'వైఎస్సార్‌ రైతు భరోసా'గా కేంద్రం రైతులకు ఇచ్చేదానిపై బాబు లాగా మీరు స్టిక్కర్ వేయడం తప్పు. రైతు భరోసాకు మోదీ గారి పేరు పెట్టండి’’ అని ఆయన ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మార్చి.. తన పథకాలుగా ప్రచారం చేసుకున్నారనేది బీజేపీ వాదన. ఎన్నికల ముందు ప్రధాని మోదీ సైతం టీడీపీ అధినేతను స్టిక్కర్ బాబు అని ఎద్దేవా చేశారు. రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేల సాయం అందిస్తోంది. ఇక మీరు అదనంగా ఇచ్చేది మరో రూ.6500 మాత్రమే. కాబట్టి ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలనేది కన్నా వాదన. రైతు భరోసాలో కేంద్రం వాటా కంటే రాష్ట్రం వాటా ఎక్కువైనప్పటికీ కన్నా మాత్రం మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. అయినా కేంద్రం ప్రవేశపెట్టే పథకాలకే మోదీ అనే వాడకుండా.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన అని పేర్లు పెడుతున్నారు. మరి రాష్ట్రంలో మాత్రం మోదీ అనే పేరు పెట్టాలనుకోవడం ఏంటో బీజేపీ నేతలకే తెలియాలి.


By September 26, 2019 at 11:30AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/andhra-pradesh-bjp-chief-kanna-lakshminarayana-demands-ys-jagan-to-use-modi-name-for-ysr-rythu-bharosa/articleshow/71306359.cms

No comments