Breaking News

TDP: బుద్దా వెంకన్న సంచలన నిర్ణయం.. కేశినేని ఎఫెక్టే కారణమా?


ఎమ్మెల్సీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారం విజయవాడలో జరిగిన టీడీపీ సమావేశానికి హాజరైన ఆయన తాను ఇకపై టీడీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా పని చేయలేనని తెలిపారు. ఆ పదవి మరెవరైనా తీసుకోండన్న ఆయన.. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. బుద్ధా వెంకన్న గత ఆరేళ్లుగా అర్బన్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ ఆయన బెజవాడ అర్బన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల చేసిన కామెంట్లతో బుద్దా మనస్థాపం చెందారని తెలుస్తోంది. ‘‘నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు’’ అని ట్విట్టర్ వేదికగా బుద్దాను కేశిననేని టార్గెట్ చేశారు. ఈ మాటలు బుద్దాపై తీవ్ర ప్రభావం చూపాయని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు బుద్దా నాలుగు పదవుల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, టీడీపీ అధికార ప్రతినిధి, అర్బన్ అధ్యక్షుడు ఇలా నాలుగు పదవులు నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన విప్ పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయనకు మూడు పదవులు ఉన్నాయి. బెజవాడలో చాలా మంది నేతలున్నప్పటికీ బుద్దా వెంకన్నకు అన్ని పదవులు ఇవ్వడం, అంత ప్రయారిటీ ఇవ్వడం పై చాలా మంది టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆయన అర్బన్ అధ్యక్ష పదవిని వదులుకున్న నేపథ్యంలో బుద్దా పదవుల సంఖ్య రెండుకి తగ్గింది. త్వరలోనే పార్టీ అధికార ప్రతినిధి పదవి కూడా వదులుకుంటానని సన్నిహితుల దగ్గర బుద్దా వెంకన్న చెప్పినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు కేశినేని వర్గంలో పని చేసిన బుద్దా వెంకన్న.. తర్వాత చంద్రబాబుకు దగ్గరయ్యారు. టికెట్ విషయంలో గొడవ రావడంతో కేశినేనికి దూరమయ్యారు. బాబుతో సాన్నిహిత్యం పెరగడంతో.. ఎమ్మెల్సీతోపాటు ఇతర పదవులు ఆయనకు దక్కాయి. కొసమెరుపు ఏంటంటే.. శుక్రవారం జరిగిన పార్టీ సమావేశానికి ఎంపీ కేశినేని నాని దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన సమావేశానికి హాజరు కాలేకపోయారని బచ్చుల అర్జునుడు తెలిపారు.


By August 03, 2019 at 02:53PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/kesineni-nani-effect-mlc-buddha-venkanna-not-willing-to-work-as-vijayawada-tdp-urban-president/articleshow/70510649.cms

No comments