పాక్ ప్రధానితో ఫోన్ సంభాషణ.. ‘కశ్మీర్’పై యూటర్న్ తీసుకున్న ట్రంప్!
కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు మళ్లీ స్వరం మార్చారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ వ్యతిరేకిస్తుంటే, దీనిపై ద్వైపాక్షిక చర్చలే సబబని ఆ దేశానికి సలహా ఇచ్చిన అమెరికా అంతలోనే యూటర్న్ తీసుకుంది. కశ్మీర్‌లో మతపరమైన విభేధాలు కారణంగా ప్రస్తుతం అక్కడ విధ్వంసకర పరిస్థితులు నెలకున్నాయని.. భారత్, పాక్‌ల మధ్య వివాదానికి కారణమైన దీనిపై మధ్యవర్తిత్వం లేదా మరేదైనా తాను చేయాల్సి ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ చాలా క్లిష్టమైన ప్రదేశమని, అక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారని, వారంతా కలిసి ఉంటారని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు. మరో రెండు రోజుల్లో ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ7 దేశాలో సమావేశంలో ఈ అంశంపై మోదీ వద్ద ప్రస్తావించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల మధ్య ఘర్షణ వాతావరణం ఉందని, ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తనవంతు సాయం చేస్తానని అది మధ్యవర్తిత్వమా మరింకేదైనా కావచ్చని ట్రంప్ పేర్కొన్నారు. కశ్మీర్ వివాదం మతంతో ముడిపడి ఉందని, ఇది చాలా క్లిష్టమైన అంశమని అమెరికా అధినేత అన్నారు. Read Also: మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులకు సంబంధించి భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సూచించిన కొద్ది గంటల్లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీతో సోమవారం నాడు ట్రంప్ దాదాపు అరగంటపాటు జరిపిన టెలిఫోన్ సంభాషణలో పాక్ దుందుడుకు వ్యాఖ్యలపై ట్రంప్ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మోదీతో మాట్లాడిన అనంతరం ట్రంప్ ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడారని, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరంపై భారత్‌తో చర్చలు జరపాలని, దూకుడు తగ్గించుకోవాలని పాక్‌కు సూచించినట్టు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కిచెప్పారని.. నియంత్రణ పాటించాల్సిందిగా ఇరువర్గాలకూ సూచించారని వెల్లడించాయి. అమెరికా-పాకిస్థాన్ నడుమ ఆర్థిక, వాణిజ్య సహకార బలోపేతంపైనా ఇద్దరు నేతలూ చర్చించినట్టు వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే.. భారత్, పాక్ నడుమ ఉదిక్త్రతలను తగ్గించుకోవాల్సిన అవసరం గురించి, శాంతిని కొనసాగించాల్సిన ఆవశ్యకత గురించి ట్రంప్.. భారత ప్రధాని మోదీకి కూడా తెలిపారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ హోగన్ గిడ్లే వెల్లడించారు. ఇమ్రాన్‌తో వారం వ్యవధిలోనే రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్, మరోసారి పాక్‌కు మద్దతుగా మాట్లాడటం గమనార్హం. Read Also: ఇటీవల అమెరికాలో పర్యటించిన పాక్ ప్రధాని.. కశ్మీర్ అంశంపై అమెరికా మధ్వవర్తిత్వం కోరారు. దీంతో తాము మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని, ఇదే అంశాన్ని జపాన్‌లోని జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలోనూ భారత ప్రధాని మోదీ తనతో చెప్పినట్టు ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత్.. కశ్మీర్ అంశంలో ఇతరుల జోక్యాన్ని సహించబోమని, ఇది తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేయడంతో ట్రంప్ వెనక్కుతగ్గారు. తర్వాత ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేయగా, పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
By August 21, 2019 at 09:23AM
No comments