మోదీ ‘మిషన్ కశ్మీర్’.. కీలక పాత్ర పోషించిన తెలుగోడు!
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యకే హక్కులు కల్పిస్తోన్న రాజ్యాంగంలోని రద్దుకు మోదీ సర్కారు గత ఏడాది ఆగస్టు నుంచే వ్యూహరచన చేసిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీడీపీతో జతకట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, 2018 జూన్‌లో తప్పుకొంది. అలాగే 2008 నుంచి ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగుతోన్న ఎన్ఎన్ వోహ్రా స్థానంలో సీనియర్ రాజకీయ నేత సత్యపాల్ మాలిక్‌ను 2018 ఆగస్టులో నియమించింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రాంతీయ పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటుండగా 2018 డిసెంబర్‌లో రాష్ట్రపతి పాలన విధించి వారికి షాక్ ఇచ్చింది. గవర్నర్ నియామకం దగ్గర నుంచే బీజేపీ వ్యూహం మొదలయింది. వాస్తవానికి అక్కడ గవర్నర్లుగా అధికారులను నియమించడం సంప్రదాయంగా కొనుసాగుతుండగా, రాజకీయ నేత మాలిక్‌ను పంపి తన వ్యూహాలను అమలుచేసింది. అలాగే, గత అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి 40వేల మందికి రాజకీయ ఉపాధి కల్పించింది. సాధారణ ఎన్నికల సమయంలో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు జరిపించి అసెంబ్లీని పక్కనపెట్టింది. మరోవైపు, కశ్మీర్‌లో అలజడులకు కారణమవుతోన్న వేర్పాటువాదుల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ, బ్యాంకుల్లో వారి అక్రమ లావాదేవీలపై కొరడా ఝలిపించింది. శుక్రవారం హఠాత్తుగా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయడంతోపాటు అదనపు బలగాలను మోహరించింది. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబా, బీఆర్ సుబ్రమణ్యం, గవర్నర్ సత్యపాల్ మాలిక్, గతంలో నిఘావ్యవస్థ అధిపతిగా పనిచేసి ప్రస్తుతం నాగాలాండ్ గవర్నర్ ఆర్‌ఎన్ రవి, మినహా మరో వ్యక్తికి తెలియకుండా వ్యూహాన్ని పక్కగా అమలు చేసింది. బిల్లు రూపకల్పనలో న్యాయ శాఖలో శాసన విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జి.నారాయణరాజు కూడా కీలక పాత్ర పోషించారు. నారాయణ రాజు 2015 అక్టోబరులో లెజిస్లేటివ్ సెక్రెటరీగా కేంద్రం నియమించింది. అంతకు ముందు న్యాయ శాఖలోని పలు విభాగాల్లో పనిచేసిన ఆయనకు కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఆర్టికల్ 370 రద్దుపై ఆయన కీలక సూచనలు, సలహాలు చేశారు. రెండోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రంలోని సీనియర్ అధికారులకు రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన కీలక సమాచారం అందజేయాలని ఆదేశాలు అందాయి. దీంతో జమ్మూ కశ్మీర్ అంశంపై ప్రధాని కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం అధికార వర్గాల్లో జరిగింది. అయితే, దీనిని బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించారు. ప్రధాన వ్యూహానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వంలోని సీనియర్లు రహస్యంగా ఉంచారు. ఆర్టికల్ 370 రద్దుపై కీలక అధికారులతో చర్చ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, జుమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన జగ్‌మోహన్ రాసిన ‘మై ఫ్రోజెన్ టర్బ్‌లెన్స్’ పుస్తకంలో దీని రద్దుకు సంబంధించిన కీలక మార్గం లభించింది. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్‌లో శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా హోం మంత్రి అమిత్ డైరెక్షన్‌లో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, పారామిలటరీ దళాలు సంయుక్తంగా పనిచేసి, బలగాలను మోహరించాయి. అలాగే, ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాలను వెనక్కు రప్పించడానికి అమెరికా ప్రయత్నించడంతో పాక్ నుంచి కొత్తగా ముప్పు ఉందనే సాకుతో లోయలో బలగాలను మోహరించి, అందరి దృష్టి మరల్చడానికి సాయపడింది.
By August 06, 2019 at 11:11AM
No comments