Breaking News

వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి


భారత మాజీ ప్రధాని, దివంగత నాయకుడు అటల్ బిహారి వాజ్‌పేయికి తొలి వర్ధంతి సందర్భంగా శుక్రవారం (ఆగస్టు 16)న ఢిల్లీలో ప్రముఖులు నివాళి అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితర నేతలు వాజ్‌పేయి స్మారక కేంద్రం అటల్ సదైవ్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ నాయకులతోపాటు వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా భట్టాచార్య, మనవరాలు నిహారిక కూడా అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. వాజ్‌పేయి సేవలను గుర్తు చేసుకున్నారు. ‘ఆయన ఆలోచనలు, మాటలు ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయి. దేశ అభివృద్ధికి అటల్‌జీ చేసిన సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. జైసల్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ కోవింద్ కూడా వాజ్‌పేయికి నివాళి అర్పించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా శ్రద్దాంజలి ఘటించారు. వాజ్‌పేయ్ హాయాంలో మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అటల్‌జీ.. ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్ విధానాలను దేశ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. భారత ప్రధానిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్‌పేయి 93 ఏళ్ల వయసులో గతేడాది ఆగస్టు 16న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్‌పేయి 1996-2004 మధ్య మూడుసార్లు దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు 47 ఏళ్లపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగిన వాజపేయి 10 పర్యాయాలు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పోఖ్రాన్ అణు పరీక్ష, కార్గిల్ యుద్ధం, ఢిల్లీ-లాహోర్ బస్సుయాత్ర లాంటి నిర్ణయాలతో ఆయన దేశచరిత్రలో చెరగని ముద్రవేశారు. సుపరిపాలన, ఉన్నతమైన వ్యక్తిత్వంతో వాజ్‌పేయ్ రాజకీయాలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. బీజేపీనే కాకుండా ఇతర పార్టీల నాయకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ‘రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అంటూ కమ్యూనిస్టులు సైతం వాజ్‌పేయిని కీర్తించారు.


By August 16, 2019 at 02:38PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/president-and-prime-minister-pay-tribute-to-atal-bihari-vajpayee-on-his-death-anniversary/articleshow/70699088.cms

No comments