Breaking News

ఆ విషయం తెలిసీ సెక్స్‌లో పాల్గొంటే అది రేప్ కాదు: సుప్రీం


సీఆర్పీఎఫ్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తర్వాత మోసం చేశాడని ఆరోపిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఉద్యోగి అతడిపై మూడేళ్ల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, దీనిని డిప్యూటీ కమాండెంట్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. సర్వోన్నత న్యాయస్థానం బుధవారం దీనిపై తీర్పు వెలువరిస్తూ, మహిళ ఉద్యోగి ఆరోపణలను తోసిపుచ్చింది. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ అనేక ఏళ్లుగా శారీరక సంబంధం కొనసాగిస్తున్నారని, ఆ తర్వాతే పెళ్లి అంశం వివాదాస్పదమైందని, ఇది అత్యాచారం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఒక పురుషుడితో మహిళ దీర్ఘకాలం శారీరక సంబంధాన్ని కొనసాగించి, అతడితో పెళ్లి ఫలవంతం కాదని తెలిసినప్పుడు అత్యాచారం చేసినట్లు ఆరోపించలేరని పేర్కొంది. ఈ కేసును విచారించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం.. గతంలో నిందితుడు వాట్సాప్ ద్వారా పంపిన అభ్యంతరకరమైన మెసేజ్‌లు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నివారణ చట్టం ప్రకారం నేరం కాదని, ఎందుకంటే అవి వారి ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత విషయమని పేర్కొంది. అంతేకాదు, 2015 ఆగస్టు 27,28, అక్టోబరు 22న మెసేజ్‌లు పంపే సమయానికి ఎస్సీ/ ఎస్టీ చట్టంలో సవరణలు చేయలేదని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే ఆమెకు, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌తో 1998 నుంచి పరిచయం ఉంది. ఇరువురూ ఆరేళ్ల పాటు అంటే 2004 వరకు కలిసే ఉన్నారు. తర్వాత అనేక సందర్భాల్లో కలుసుకున్న వీరి మధ్య శారీరక బంధం మరింత బలపడింది. అయితే, జనవరి 2014లో పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. కులం ప్రస్తావన రావడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయినా సరే మార్చి 2015 వరకు తమ లైంగిక బంధాన్ని కొనసాగించారు. అనంతరం కమాండెంట్‌పై సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. మరో మహిళను వివాహం చేసుకోడానికి సిద్ధపడినట్టు ఆరోపించింది. అయితే, ఇష్టపూర్వకంగానే అతడితో సెక్స్‌లో పాల్గొందని, పెళ్లి విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం వచ్చిందని విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. అతడిపై 2016 మే 17న దాఖలైన ఎఫ్ఐఆర్‌ను తోసిపుచ్చింది. ‘వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడం మోసం చేయడమే అవుతుంది కానీ, వాస్తవానికి ఆమె సమ్మతితోనే ఇది జరిగింది.. మరోవైపు, అతడి వాగ్దానం తప్పని చెప్పలేం... వాగ్దానం చేసినవారికి తన మాటను ఇచ్చే సమయంలో దానిని సమర్థించే ఉద్దేశం ఉండకూడదని’ ధర్మాసనం వ్యాఖ్యానించింది.


By August 22, 2019 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-quashed-the-rape-case-lodged-by-an-assistant-commissioner-against-commandant-of-crpf/articleshow/70782355.cms

No comments