నిట్ శ్రీనగర్ అత్యవసరంగా మూసివేత: ఆందోళనలో తెలుగు విద్యార్థులు.. స్పందించిన కేటీఆర్
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 35-ఎ, 370లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందనే ఊహాగానాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది. అమర్‌నాథ్ యాత్రికులను వెనక్కు రావాలని శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. తాజాగా, శ్రీనగర్ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో అక్కడ చదువుతోన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భయాందోళనకు గురైన విద్యార్థులు తమకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ విద్యార్థులను శ్రీనగర్ నుంచి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరీని సంప్రదించాలని పేర్కొన్నారు. సంబంధిత ఫోన్ నెంబర్లను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 011-2338 2041 లేదా +91 99682 99337 ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘నిట్ శ్రీనగర్‌లో చదువుతున్న వారిని తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నట్లు చాలా మెసేజ్‌లు వచ్చారు. మీరు ఆందోళన పడవద్దు. మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. వారు మీకు సాయం చేస్తారు. ఏ విద్యార్థి లేదా తల్లిదండ్రులకైనా సాయం కావాలనుకుంటే ఢిల్లీలో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శ్రీ వేదాంతం గిరి ఫోన్ లేదా మొబైల్ 011-2338 2041 లేదా +91 99682 99337కు కాల్ చేసి సంప్రదించండి’’ ట్వీట్ చేశారు. శ్రీనగర్ నిట్‌లో సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు చదువుతుండగా, రెండు రోజుల కిందటే సెలవులు ముగియడంతో క్యాంపస్‌కు చేరుకున్నారు. అయితే, తక్షణమే క్యాంపస్‌ను ఖాళీచేయాలన్న కేంద్రం ఆదేశాలతో తిరుగుముఖం పట్టారు. క్యాంపస్ నుంచి జమ్మూ రైల్వేస్టేషన్ వరకు నిట్ అధికారులు రవాణా సౌకర్యం కల్పించారు. ఈరాత్రికి వారంతా జమ్మూ చేరుకోనుండగా అక్కడ నుంచి ఢిల్లీకి రావడానికి ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 35-ఏ, 370లకు సంబంధించి కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారానికి బలం చేకూర్చేలా భారీస్థాయిలో భద్రతా బలగాలను అక్కడ మోహరిస్తున్నారు.
By August 03, 2019 at 04:32PM
No comments