Breaking News

వసూల్ రాజాగా మారిన ‘ఉత్తమ’ కానిస్టేబుల్ .. అవార్డు తీసుకున్న మరుసటి రోజే..


స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉత్తమ కానిస్టేబుల్‌గా అవార్డు అందుకున్న వ్యక్తి 24 గంటలు గడవకముందే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం తెలంగాణలో కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి ఆగస్టు 15న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ఉత్తమ కానిస్టేబుల్ అవార్డు అందుకున్నాడు. అయితే అతడే గురువారం లంచం తీసుకుంటుండగా అధికారులు చిక్కాడు. దీంతో అవార్డుల ఎంపికపై ప్రజలు మండిపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి ఇసుక వ్యాపారుల వద్ద తరచూ డబ్బులు వసూలు చేస్తూ అక్రమార్జనకు అలవాటు పడ్డాడు. శుక్రవారం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ముడావత్‌ రమేశ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఇసుక తరలిస్తున్నప్పటికీ తిరుపతిరెడ్డి అడ్డుకున్నాడు. రూ. 17వేలు ఇస్తేనే ట్రాక్టరును విడిచిపెడతానని, లేకపోతే తప్పుడు కేసులు పెడతానని బెదిరించాడు. దీంతో రమేశ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బును రమేశ్ శుక్రవారం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే తిరుపతిరెడ్డికి ఇచ్చాడు. లంచం తీసుకున్న ఉత్సాహంలో స్టేషన్‌లోకి అడుగుపెడుతున్న తిరుపతిరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిరెడ్డి ఇసుక వ్యాపారుల నుంచి చాలాకాలంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కానిస్టేబుల్ తన నుంచే ఎన్నోసార్లు డబ్బులు వసూలు చేశాడని బాధితుడు రమేశ్ ఏసీబీ అధికారులకు చెప్పాడు. దీంతో నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. లంచాలకు మరిగిన కానిస్టేబుల్‌కు ఉత్తమ అవార్డుకు ఎలా ఎంపికి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల లంచం కేసులో అరెస్టయిన కేశంపేట తహసీల్దార్ లావణ్య కూడా గతంలో ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. హయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఏకంగా రూ.93లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.


By August 17, 2019 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-conistable-held-by-acb-officers-for-harassing-sand-supplier-in-mahbubnagar/articleshow/70709378.cms

No comments