Breaking News

రాజధాని తరలింపు.. వెనకి తగ్గని బొత్స, అమరావతి కలలు కల్లలేనా?


ఏపీ రాజధాని అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని మంత్రి ఐదు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం లేపాయి. రాజధానిని మార్చొద్దని ప్రతిపక్షలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బొత్స మరోసారి బాంబు పేల్చారు. ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన బొత్స.. రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాజధాని ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలదని.. ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినదో కాదని బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ సూచనలను పట్టించుకోలేదన్న బొత్స.. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని విమర్శించారు. అమరావతికి వరద ముప్పు ఉందన్న బొత్స.. 8 లక్షల క్యూసెక్కుల నీటికే ఈ ప్రాంతం ముంపునకు గురైతే.. 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధానిని నుంచి తరలించొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జగన్‌ సర్కార్‌ను డిమాండ్ చేసిన నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్‌ చేసి వ్యాఖ్యలు ద్వంద్వ అర్థాన్ని ఇస్తున్నాయని బొత్స విమర్శించారు. బొత్స వ్యాఖ్యలను గమనిస్తుంటే.. రాజధాని విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉందని తెలుస్తోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించకపోయినా.. పరిశ్రమలు, విద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ఒకే చోట కేంద్రీకృతం చేయొద్దని జగన్ సర్కారు భావిస్తోంది. అభివృద్ధి మొత్తాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయడం వల్ల విభజనతో నష్టపోయామని, ఇప్పుడు అదే సీన్ రిపీట్ కావొద్దంటే అభివృద్ధి వికేంద్రీకరణే సరైందని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.


By August 25, 2019 at 01:59PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-capital-belongs-to-5-crore-peoples-says-minister-botsa-satyanarayana/articleshow/70826799.cms

No comments