Breaking News

ఆ రోజుల్లో అందరికీ ఒకటే డ్రగ్.. ఆ డ్రగ్ పేరు చిరంజీవి!


మెగాస్టార్.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని గర్వం ప్రతి తెలుగు సినీ ప్రేమికుడి గుండెల్లో నుంచి బయటికి వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనొక పర్వతం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణిదెల శివశంకర వర ప్రసాద్ తన నటనకు ‘పునాదిరాళ్లు’ వేసుకుని ‘స్వయంకృషి’తో చిరంజీవిగా ఎదిగారు. అప్పటికే మహామహులతో నిండిపోయిన తెలుగు సినీ ప్రపంచంలో తాను ‘విజేత’గా నిలిచారు. అభిమానులకు ‘గ్యాంగ్ లీడర్’గా.. టాలీవుడ్‌కు మెగాస్టార్‌‌గా తనకంటూ చరిత్రలో ఒక పేజీని నింపుకున్నారు. నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా మెగాస్టార్ బర్త్‌డే విషెస్‌తో నిండిపోతోంది. అయితే, ఒకరు చెప్పిన బర్త్‌డే విషెస్ మాత్రం చిరంజీవి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ విషెస్ చెప్పింది.. ‘హృదయకాలేయం’ దర్శకుడు, ‘కొబ్బరి మట్ట’ నిర్మాత సాయి రాజేష్ అలియాస్ స్టీఫెన్ శంకర్. ఈయన చిరంజీవి వీరాభిమాని. నేడు మెగాస్టార్ పుట్టినరోజును పురష్కరించుకుని రాజేష్ ఫేస్‌బుల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ అద్భుతంగా ఉంది. ఆ రోజుల్లో అందరికీ చిరంజీవి ఒక డ్రగ్ అని, ఆయన సినిమా చూడని ప్రేక్షకుడు లేడని రాజేష్ అభివర్ణించారు. ‘‘పొద్దంతా రిక్షా తొక్కి, రాత్రి నేల టికెట్ కొన్న రిక్షావాడు, రోజంతా కూలీ చేసి, వారానికో సినిమా చూసే ఒక కార్మికుడు, నెలంతా కష్టపడి, జీతంలో కొంత భాగంతో కుటుంబాన్ని సినిమాకు తీసుకెళ్లే ఒక మధ్యతరగతి వాడు, చదువు, ఆత్మనూన్యత, పరీక్షలు, ప్రేమ, పేదరికం, అవమానం లాంటి సమస్యలతో బాధపడే ఒక విద్యార్థి.. ఆ రోజుల్లో అందరికీ ఒకటే డ్రగ్... ఆ డ్రగ్ పేరు చిరంజీవి... డబ్బైల్లో, ఎనబైల్లో, తొంబైల్లో పుట్టిన సగటు తెలుగు వాడి జీవితంలో ఆయనో భాగం. ఇరవై రూపాయిలు పెడితే.. ఆ నెల కష్టం మర్చిపోయేలా చేసేవాడు. డల్లాస్‌లో వేల రూపాయల డాలర్లు సంపాదించే వాడు కూడా శనివారం పెగ్గేసి ముఠామేస్త్రి పాటలు వింటూ.. జ్ఞాపకాలు నెమరేస్తాడు. చిరంజీవి ఉనికిని, చిరంజీవి స్థాయిని, చిరంజీవి స్టామినాని, చిరంజీవి అనే పేరుని నువ్వు అంగీకరించలేకపోతున్నావ్ అంటే నీ కళ్ళకి అదేదో అడ్డుపడి ఉండాలి. ఆడో పెద్ద సిరంజీవి మరి.. ఏరోయ్.. సిరంజీవి అనుకుంటున్నావేటి.. లాంటి మాటలు చెప్తాయి చిరంజీవి అనేటోడు హీరో అనే పదానికి పర్యాయపదమని. సినిమా ఇండస్ట్రీ వాడికైనా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అయినా.. చిరంజీవి జ్ఞాపకాలు చుట్టు ముట్టి ఉంటాయి. అందుకే వెనక్కి తిరిగి చూసుకుంటే.. అమ్మ, నాన్న, స్నేహితుడు, బడి, కాలేజీ, ప్రియురాలు.. వాటితో పాటు చిరంజీవి ఉంటాడు. నా బాధ అతని వల్ల సగం అవుతోంది. నా సంతోషం అతని వల్ల రెట్టింపు అవుతోంది. నా బాల్యం, యవ్వనం.. వెనక్కి తిరిగి చూసుకుంటే అతని జ్ఞాపకాలు నన్ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. నేను దర్శకుడిని కావడానికి ఆయనే నాకు స్ఫూర్తి. ఇండస్ట్రీలో గౌరవం అంటూ ఒకటి ఉందంటే అది ఆయన వల్లేనని నేను భావిస్తాను. లవ్ యు బాస్.. హ్యాపీ బర్త్‌డే ’’ అని రాజేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


By August 22, 2019 at 07:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kobbari-matta-producer-hrudaya-kaleyam-director-sai-rajesh-tribute-to-megastar-chiranjeevi-on-his-birthday/articleshow/70779681.cms

No comments